భావితరాలకు జగన్మోహనం ‘పుస్తకం’ దిక్సూచి: మంత్రి ధర్మాన
రాష్ట్ర పరిపాలనపై రచించిన పుస్తకం భావితరాలకు దిక్సూచిగా నిలుస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు...
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర పరిపాలనపై రచించిన పుస్తకం భావితరాలకు దిక్సూచిగా నిలుస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ మేరకు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, ప్రపంచ రికార్డు గ్రహీత డాక్టర్ తాటికొండ వేణుగోపాల్ రెడ్డి, ప్రముఖ రచయిత, జర్నలిస్టు విజయార్కె రచించిన “జగన్మోహనం.. అభివృద్ధిపథంలో ఆంధ్రప్రదేశ్” పుస్తకాన్ని రాష్ర్ట సచివాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం జగన్ ప్రతిభా విశేషాలు, చాతుర్యాన్ని, ఆలోచనా ధోరణి, పరిపాలనా తీరును, వ్యక్తిత్వం, పట్టుదల గురించి కూలంకషంగా అధ్యయనం చేసి సరళంగా అర్థమయ్యేరీతిలో పుస్తకం రాయడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో జరిగే పాలన, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి తీరుపై 49 అధ్యాయాల్లో సవివరంగా ఈ పుస్తకంలో చాలా చక్కగా వివరించినట్లు పేర్కొన్నారు. ఏ రంగంలోనైనా సమర్థవంతంగా పని చేసే వ్యక్తులను చూడడం సామాన్యమైన విషయమన్నారు. అలా చూసిన విషయాలను గ్రంథస్తం చేసి, ఇతరులు చదివి అర్థం చేసుకునే విధంగా రాయడం గొప్ప విషయమన్నారు. ఒక ముఖ్యమంత్రి గురించి ప్రస్తుత, భావితరాలు తెలుసుకునేందుకు రచించిన ఈ పుస్తకం ఎంతో దోహపడుతుందని చెప్పారు. అంతకుముందు మంత్రి రచయితలను ఘనంగా సత్కరించారు.
ప్రజలకు ‘పుస్తకం’ అంకితం : రచయిత డాక్టర్ తాటికొండ వేణుగోపాల్ రెడ్డి
రాష్ట్ర పరిపాలన, ముఖ్యమంత్రి అంకితభావాలను క్రోడీకరించి రచించిన “జగన్మోహనం.. అభివృద్ధిపథంలో ఆంధ్రప్రదేశ్” పుస్తకాన్ని రాష్ర్ట ప్రజలకు అంకితం చేస్తున్నట్లు రచయిత డాక్టర్ తాటికొండ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో పలు రంగాల్లో వినూత్న సంస్కరణలను అమలు పర్చారని ప్రశంసించారు. విద్యా, వైద్యం, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో గణనీయమైన మార్పులు తీసుకురావడమే కాకుండా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు పరచిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు