visakha: పవన్ కల్యాణ్‌పై మంత్రి బొత్స విసుర్లు

ఆ సెలబ్రిటీ నాయకుడు మాట్లాడే దాంట్లో న్యాయం లేదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు

Update: 2023-03-12 10:06 GMT

దిశ, ఉత్తరాంధ్ర:ఆ సెలబ్రిటీ నాయకుడు మాట్లాడే దాంట్లో న్యాయం లేదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేశారు. ఇటీవల పవన్ కల్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతుండటం చూస్తుంటే జాలి వేసిందని బొత్స ఎద్దేవా చేశారు. 

పవన్ కల్యాణ్‌కు అలవాటే..

‘కేవలం నేను ఉన్నాను అని చెప్పేందుకు అప్పుడప్పుడు మీడియాలో కనిపిస్తుండడం పవన్‌కు అలవాటయింది. తెలంగాణలో 26 బీసీ కులాలను వేరు చేస్తుంటే బొత్స ఏం చేస్తున్నారని పవన్ ప్రశ్నించడం అవగాహన రహిత్యం. బొత్స ఒక నాయకుడు అయితే కాపు జాతి బాగుపడినట్టేనా అని పవన్ ప్రశ్నించడం వెనక ఆంతర్యం ఏమిటి. నాకన్నా ముందు కాపు నాయకులు చాలా మంది నాయకులయ్యారు. ప్రజా సేవ చేశారు. వారి బాటలోనే సమాజానికి, కులాలకు అతీతంగా సేవలు అందిస్తున్నా. 2014లో రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో 26 కులాలను బీసీ జాబితా నుంచి తప్పించడం వాస్తవం. ఆ సమయంలో అధికారంలో లేకపోయినా ప్రశ్నించాం. ఈ అంశంపై న్యాయ పరంగా కూడా పోరాడాం.’ అని పవన్‌పై బొత్స విరుచుకుపడ్డారు.

పవన్ చెప్పిన ప్రతీదాన్ని జనం నమ్మరు..

పవన్ ఏది చెప్తే అది జనం నమ్మేస్తారనుకుంటే సరి కాదని బొత్స సూచించారు. రెండు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌లో 50 శాతం బీసీలకు ఖర్చు చేశామని ఆయన తెలిపారు. వాటన్నింటిని గణాంకాలతో చూపించగలమన్నారు. పవన్ కల్యాణ్‌తో చంద్రబాబు మాట్లాడిస్తున్నాడని అనుమానం కలుగుతోందన్నారు.‘చంద్రబాబుకు అవగాహన లేదు. కనీసం పవన్ కల్యాణ్ అయినా అవగాహన చేసుకుని మాట్లాడాలి.’ మంత్రి బొత్స హితవు పలికారు.

Tags:    

Similar News