AP News:కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చట్టం.. మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన

గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా రుణ ప్రణాళిక, పర్యవేక్షణ, అభివృద్ధి మరియు వ్యవసాయ ప్రోత్సాహక కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి రాష్ట్రాభివృద్ధికి నాబార్డ్ తనవంతు కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

Update: 2024-12-04 10:50 GMT

దిశ,వెబ్‌డెస్క్: గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా రుణ ప్రణాళిక, పర్యవేక్షణ, అభివృద్ధి మరియు వ్యవసాయ ప్రోత్సాహక కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి రాష్ట్రాభివృద్ధికి నాబార్డ్ తనవంతు కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మేరకు బుధవారం విజయవాడలోని స్టాలిన్ సెంట్రల్ కాంప్లెక్స్‌లో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయాన్ని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి పయ్యావుల కేశవ్, నాబార్డ్ చైర్మన్ షాజీ కెవి లతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. నాబార్డు ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేయడం శుభపరిణామం అన్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడంలో నాబార్డు విశేష కృషి చేస్తోందన్నారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంతో వ్యవసాయ రంగానికి సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తూ ముందుకెళ్తున్నారని తెలిపారు. ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.45 వేల కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాలు, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో నాబార్డ్ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాలు 64 శాతం, రాష్ట్ర జీడీపీలో నాబార్డ్ 34 శాతంగా ఉన్నాయన్నారు.

రాష్ట్ర విభజన సమయంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమరావతికి తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటివరకు హైదరాబాద్‌లో ఉన్న నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయం రాష్ట్రానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అమరావతిలో నిర్మించే నాబార్డ్ శాశ్వత ప్రాంతీయ కార్యాలయానికి ఇప్పటికే భూమిని కేటాయించడం జరిగిందని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా అన్ని రకాల సదుపాయాలతో ఒక ఐకానిక్‌లా నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయానికి పూర్వవైభవం తీసుకొస్తామని, కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చట్టం అమలు చేస్తామన్నారు. ఫిషరీస్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామిగా నిలబెట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, ఎగుమతులను మరింత ప్రోత్సహిస్తామన్నారు. డ్రోన్లతో వ్యవసాయం చేసేలా కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, ఇప్పటికే 40 వేల డ్రోన్లు ఇవ్వాలని నిర్ణయించారు అని తెలిపారు.

Tags:    

Similar News