AP News:పుస్తకాల బరువు తగ్గించండి.. నాణ్యత పెంచండి: మంత్రి లోకేష్
ఏపీలో దేశంలోనే అతిపెద్ద విండ్ ఎనర్జీ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్, స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) నడుమ ఒప్పందం కుదిరింది.
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో దేశంలోనే అతిపెద్ద విండ్ ఎనర్జీ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్, స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) నడుమ ఒప్పందం కుదిరింది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఉండవల్లి నివాసంలో ఇరుపక్షాలు ఎంఓయు చేసుకున్నారు. వచ్చే 4 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్‌ను విండ్ ఎనర్జీ నైపుణ్యాల కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా సుజ్లాన్ సహకారంతో యాంత్రిక, ఎలక్ట్రికల్, బ్లేడ్ టెక్నాలజీ, సివిల్, లైసనింగ్ వంటి కీలక రంగాల్లో 12 వేల మందికి శిక్షణ ఇస్తారు. యువత, మహిళలు, ఎస్టీఈఎం గ్రాడ్యుయేట్స్ చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగు పరచడం ఒప్పందం ముఖ్య ఉద్దేశం. క్లీన్ ఎనర్జీలో జాతీయ, అంతర్జాతీయ అవకాశాల కోసం గ్లోబల్ నైపుణ్యాలను పెంపొందించడమే ఎంఓయు ప్రధాన లక్ష్యం విండ్ ఎనర్జీలో పేరొందిన సుజ్లాన్ సంస్థ ఇప్పటికే భారతదేశం, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో శిక్షణార్థులకు ప్రత్యక్ష ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. స్కూలు విద్యార్థులకు పాఠ్యపుస్తకాల బరువు తగ్గించాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. స్కూలు, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య పై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ లక్ష్యంగా సంస్కరణలు చేయాలన్నారు. ఉన్నత విద్యలో క్యూఎస్ ర్యాంకింగ్స్ లక్ష్యంగా మార్పులు చేపట్టాలని తెలిపారు. విండ్ ఎనర్జీ రంగంలో ఏపీ యువతకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు పొందేందుకు సుజ్లాన్ తో చేసుకున్న ఒప్పందం దోహదపడుతుందని అన్నారు. ఒప్పందంలో భాగంగా 3 నుంచి 12 నెలల షార్ట్-టర్మ్, 12 నెలలకు పైగా లాంగ్-టెర్మ్ శిక్షణ ఇస్తారు.
విండ్ ఎనర్జీ రంగ అవసరాలకు అనుగుణంగా ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్ కాలేజీల్లో వృత్తి కోర్సులు, ఎలెక్టివ్ ప్రోగ్రాములు నిర్వహిస్తారు. ఎంపిక చేసిన ఐటీఐ పాలిటెక్నిక్ కాలేజీల్లో స్కిల్ ల్యాబ్‌ల ఏర్పాటు చేస్తారు. విండ్ ఎనర్జీ టెక్నాలజీలలో అధునాతన పరిశోధన, ఆవిష్కరణ, అనుభవజ్ఞాన శిక్షణ కోసం ఎక్సలెన్స్ సెంటర్లు (COEs) స్థాపిస్తారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో ఉపాధికి తోడ్పడే గ్లోబల్ సర్టిఫికెట్లు ప్రవేశపెడతారు. శిక్షణా కార్యక్రమాలు, పరిశోధనా ల్యాబ్‌లలో ఆధునిక టెక్నాలజీలను అమలుచేస్తారు. సుజ్లాన్ భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్‌ను విండ్ ఎనర్జీ నైపుణ్యాల కేంద్రంగా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది, గ్లోబల్ స్థాయిలో ప్రతిభావంతులను తయారు చేసి, భారతదేశం క్లీన్ ఎనర్జీ రంగ ఆవిష్కరణలలో ఏపీని ముందు వరుసలో నిలబెడుతుంది.