మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్: ఇల్లు కూలి నాలుగేళ్ల బాలుడు దుర్మరణం

మిచౌంగ్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది.

Update: 2023-12-03 07:00 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : మిచౌంగ్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుపాను ప్రభావంతో రాయలసీమ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ ఈదురుగాలులు ఓ పసివాడి ప్రాణాన్ని బలితీసుకుంది. గాలుల తీవ్రతకు గుడిసె కూలి పసి బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగింది. ఏర్పేడు మండలంలోని చిందేపల్లి గిరిజన కాలనీలో విస్తారంగా వర్షం కురుస్తోంది. దానికి తోడు ఈదురుగాలులు సైతం వీస్తున్నాయి. దీంతో ఓ గుడిసె కూలి ఆ ఇంట్లో ఉన్న నాలుగేళ్ల చిన్నారి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే చిందేపల్లి గిరిజన కాలనీలో శ్రీను, కావేరి దంపతులు జీవిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. రెండవ సంతానం యశ్వంత్. మిచౌంగ్ తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తుండటంతో గోడలు తడి అయ్యి పక్కనే ఉన్న యశంత్‌పై కూలి పడ్డాయి. దీంతో యశ్వంత్ తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో చిందేపల్లి గిరిజన కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఈ గ్రామంలో 14 నివాసాలకు పైగా గుడిసెలలో కాపురం ఉంటున్నారని వారందరినీ సురక్షిత ప్రదేశానికి వెళ్లాలని ప్రజలు కోరుతున్నారు. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడిన సంగతి తెలిసిందే. ఈ మిచౌంగ్ తుపాను ఏపీ తీరానికి చేరువలోకి వచ్చింది. నెల్లూరుకు ఆగ్నేయంగా 440 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుపాను మరింత బలపడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపాను వాయవ్య దిశగా పయనిస్తూ డిసెంబరు 5న నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) పేర్కొంది. ఈ తుపాను ప్రభావంతో డిసెంబరు 3న కోస్తాంధ్రలో చాలా ప్రదేశాల్లో మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Tags:    

Similar News