ఈ జిల్లాల ప్రజలు బయటకు రావొద్దు.. వాతావరణ శాఖ హెచ్చరిక!
రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. అయితే గతేడాది ఏప్రిల్ నుంచి వడగాలుల ప్రభావం చూపగా.. ఈసారి ఫిబ్రవరి నుంచే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఉదయం నుంచే ఎండలు మండి పోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తీవ్రమైన ఎండ తీవ్రత, వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో తీవ్ర వడగాలులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
వడగాలులు ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో మొబైల్స్(Mobiles)కు హెచ్చరికలు పంపించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ రోజు(బుధవారం) ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ(AP Disaster Management Authority) తాజాగా వెల్లడించింది.
ఈ క్రమంలో నేడు కృష్ణా జిల్లా ఉంగుటూరు, ఉయ్యూరు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట, మక్కువ, కొమరాడ, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పాలకొండ, సీతంపేట, వీరఘట్టం. శ్రీకాకుళం జిల్లా బూర్జ, లక్ష్మీనరసుపేట, హీరమండలం. విజయనగరం జిల్లా బొబ్బిలి, వంగర మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచే ఛాన్స్ ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు పగటి పూట బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు.