పిన్నెల్లి బ్రదర్స్‌పై విజిలెన్స్ విచారణ!

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామి రెడ్డి గత ఐదేళ్ల పాలనలో చేసిన అక్రమాలపై విజిలెన్స్, ఏసీబీ శాఖలు విచారణ జరుపుతున్నాయి.

Update: 2025-03-21 01:39 GMT
పిన్నెల్లి బ్రదర్స్‌పై విజిలెన్స్ విచారణ!
  • whatsapp icon

దిశ, ప్రతినిధి నరసరావుపేట: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామి రెడ్డి గత ఐదేళ్ల పాలనలో చేసిన అక్రమాలపై విజిలెన్స్, ఏసీబీ శాఖలు విచారణ జరుపుతున్నాయి. ఆ శాఖలకు చెందిన అధికారుల బృందాలు రహస్యంగా పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. పిన్నెల్లి బ్రదర్స్ మాచర్లలో భారీ అక్రమాలకు పాల్పడ్డారని జగన్ ప్రభుత్వ హయాంలోనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఎవరెవరు? ఎంతెంత??

కోట్ల విలువైన మట్టిని అనుమతులు లేకుండానే అనుచరుల చేత అమ్మించినట్టు వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ బృందాలు దృష్టి సారించినట్లు సమాచారం. ట్రాక్టర్ మట్టిని ఎంతకు అమ్ముకున్నారు, ఎవరెవరు అందులో వాటాలు పంచుకున్నారో పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గంలోని ఓ బడా సిమెంట్ ఫాక్టరీకి కోట్ల విలువైన మట్టిని అక్రమంగా తోలినట్లు తేలింది. అలాగే పిన్నెల్లి బ్రదర్స్, అనుచరులు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని, వీటికి తోడు పట్టణంలో విలువైన ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి హస్తగతం చేసుకున్నారన్న ఆరోపణలపై కూడా విచారణ జరిగినట్లు తెలుస్తోంది. బోస్ అనే టిడిపి నాయకుడు మరణం తర్వాత కోట్ల విలువైన ఆయన ఆస్తులు దొంగ డాక్యుమెంట్లతో పరధీనమయ్యాయి. ఇందులో సూత్రధారులు, పాత్రధారుల వివరాలను కూడా ఆ బృందాలు సేకరించాయి.

సహకరించిన అధికారులపై ఆరా..

వందల ఎకరాల ప్రభుత్వ భూములు హస్తగతం చేసుకోవడంలో సహకరించిన రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు, సిబ్బంది గురించి కూడా ఆరా తీస్తున్నారు. ఐదేళ్లపాటు జరిగిన అక్రమ మద్యం వ్యాపారం పై ఆరా తీసినట్టు తెలుస్తోంది. వీటితో పాటు పిన్నెల్లి ఎమ్మెల్యే కాకముందు ఉన్న ఆస్తులు, ఆ తర్వాత బ్రదర్స్ ఆస్తుల వివరాలు కూడా ప్రభుత్వ అధికారులు సేకరించారని సమాచారం. పిన్నెల్లి హయాంలో జరిగిన అక్రమాలలో ప్రధాన పాత్ర ఆయన వద్ద అధికారిక, అనధికారిక పీఏలుగా వ్యవహరించిన వారిద్దరిని విజిలెన్స్ బృందాలు నిర్ధారించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా రమణ, శర్మ అనే వారితో పాటు మరికొందరు అక్రమాలలో పాలు పంచుకున్నట్టు ఇందుకు సంబంధించిన రికార్డులు కూడా విచారణ బృందాలు నిర్ధారించినట్టు తెలుస్తోంది. వీటికి సంబంధించిన చట్టపరమైన చర్యలు త్వరలో ప్రారంభం అవుతాయని సమాచారం.

Similar News