పెరిగిన ప్లాస్టిక్ వినియోగం.. తగ్గిన కుండల డిమాండ్

అనంతపూర్ జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా అనేక కుమ్మరి కుటుంబాలు కుల వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నాయి.

Update: 2023-04-13 04:19 GMT

కులవృత్తులు కూలబడుతున్నాయి. ఆధునిక పోకడల్లో చేతి వృత్తులు కునారిల్లుతున్నాయి. వేసవి వచ్చిందంటే ఠక్కున గుర్తొచ్చే మట్టి కుండకు ఆదరణ తగ్గి కన్నీరు కారుస్తోంది. ఆ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న అనేక మంది కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి.

దిశ, కల్యాణదుర్గం: అనంతపూర్ జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా అనేక కుమ్మరి కుటుంబాలు కుల వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నాయి. కంబదూరు మండల పరిధిలోని అండేపల్లి గ్రామంలో కుమ్మరి కులస్తులు గత 50 సంవత్సరాల నుంచి కులవృత్తి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రతి రోజూ ఇతర ప్రాంతాల నుంచి మట్టిని రవాణా చేసుకొని రోజుకు 50 కుండల వరకు అతి భారం మీద తయారు చేస్తున్నారు. అయితే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం ఎక్కువ కావడంతో కుమ్మరి కుండలకు గిరాకీ తగ్గింది.

తగ్గిన గిరాకీ

అండేపల్లి గ్రామంలో ఓ కుండల తయారీదారుడు ఇంటి వద్దనే పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఈ మధ్య కాలంలో అనారోగ్యానికి గురయ్యాడు. ఇదే సమయంలో కుండలకు గిరాకీ తగ్గడంతో ఏ పని చేయలేక దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. కుండలు దీర్ఘకాలిక మన్నిక లేకపోవడంతో ప్రజలు వాటి స్థానంలో లోహపు పాత్ర వినియోగిస్తున్నారు. దీంతో మట్టి పాత్రలకు గిరాకీ తగ్గింది.

ఒక్కో కుటుంబానికి ఒక్కో గాధ

కుమ్మరి మల్లేష్ భార్య నాగవేణి దంపతులకు ముగ్గురు సంతానం. అయితే మట్టి కుండలు తయారీలో వచ్చిన డబ్బుతో పిల్లలను చదివించుకుని పోషించాలంటే బతుకు భారంగా మారిందని వాపోతున్నారు. కులవృత్తి మీదే ఆధారపడి జీవించే ఈ దంపతులను విధి చిన్నచూపు చూసింది. ఇద్దరికీ కూడా కిడ్నీల్లో రాళ్లున్నట్లు డాక్టర్లు తెలిపారు.

ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు

ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన చేతి వృత్తి మీద ఆధారపడే కుమ్మరి కులానికి ఎటువంటి ఆర్థిక సాయం అందించడంలేదని వారు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి కుమ్మరి కులస్తులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Tags:    

Similar News