రాజకీయాల్లో ఉన్నంతకాలం నా ప్రయాణం వైఎస్ జగన్‌తోనే.. : ఆళ్ల రామకృష్ణారెడ్డి
రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో : రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపైనా ప్రభుత్వంపైనా తనకు ఎలాంటి అసంతృప్తి లేదని క్లారిటీ ఇచ్చారు. తన రాజకీయ ప్రయాణం వైఎస్ జగన్ వెంటేనని తెలిపారు. వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నానంటూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్తే ఇక వైసీపీకి దూరమైనట్లేనా అని ప్రశ్నించారు. గురువారం ఉదయం మంగళగిరిలో ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాను సంతృప్తిగా ఉన్నట్లు వెల్లడించారు.
అమరావతి ప్రాంతంలో పేదల సొంతింటి కల నెరవేరబోతుందని స్పష్టం చేశారు. అమరావతి ప్రాంతంలో 50వేలకు మందికిపైగా లబ్ధిదారులకు ఈనెల 26న సీఎం వైఎస్ జగన్ ఇళ్ల స్థలాలు పంపిణీ చేపట్టబోతున్నారని వెల్లడించారు. ఈ లబ్ధిదారుల్లో దాదాపు 22వేల మంది మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వారేనని స్పష్టం చేశారు. మరోవైపు మంగళగిరి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో నారా లోకేశ్‌ను ఓడించేందుకు ఎత్తుగడలో భాగంగానే ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నారంటూ వస్తున్న ప్రచారాన్ని ఖండించారు. ఒకరి మెప్పుకోసమో.. రాజకీయ లబ్ధికోసమో ఈ నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన సమాధుల వ్యాఖ్యలపై మండిపడ్డారు. చంద్రబాబు మతిభ్రమించిందని అందువల్లే ఇంటి స్థలాలను సమాధులతో పోల్చుతున్నారని ధ్వజమెత్తారు. ఇళ్లు లేని నిరుపేదలకు ఈ సెంటున్నర స్థలం తాజ్ మహల్ వంటివని చెప్పుకొచ్చారు. దీపావళి నాటికి ఈ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ఈ అంశంపై సీఎం వైఎస్ జగన్‌తో ప్రత్యేకంగా మాట్లాడతానని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు.