Mandali Buddhaprasad: గురువింద గింజ.. తన కింద నలుపుని గుర్తించనట్లే!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి ముందుగా తెలుగు నేర్పించమని అధికార భాషా సంఘానికి మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ సూచించారు...
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి ముందుగా తెలుగు నేర్పించమని అధికార భాషా సంఘానికి మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ సూచించారు. తెలుగుదేశం పార్టీ వారికి తెలుగు నేర్పిస్తామని అధికార భాషా సంఘం అధ్యక్షుడు విజయబాబు ఇటీవలే వెల్లడించారు. ఇందుకు బుద్దప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి ప్రతి సభలోనూ తెలుగును స్పష్టంగా పలకలేకపోవడం విజయ్ బాబు గమనించడం లేదా అని నిలదీశారు. గురువింద గింజ తన కింద నలుపుని గుర్తించనట్లే.. ఇతరులను విమర్శించేటప్పుడు తమ తప్పులను కూడా గమనిస్తే మంచిదని బుద్ధప్రసాద్ హితవు పలికారు.
విజయవాడలో తెలుగు భాష ఉద్యమ సమాఖ్య సమావేశంలో తానెక్కడా రాజకీయాలు మాట్లాడలేదని...విజయ్ బాబు పేరు కానీ ముఖ్యమంత్రి పేరు గానీ ఎత్తలేదని, తాను అధికారభాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎదుర్కొన్న సమస్యలు సాధించిన విజయాల గురించి మాత్రమే మాట్లాడానని బుద్ధ ప్రసాద్ స్పష్టం చేశారు. అప్పటికంటే ఇప్పుడు సాంకేతికత అభివృద్ధి చెందింది కనుక అధికార భాషగా తెలుగును అమలు చేయడం సులువు అని చెప్పానన్నారు. అనువాద యాంత్రీకరణ వచ్చిన తర్వాత తెలుగును సులువుగా అధికార భాషగా అమలు చేయవచ్చని చెప్పానని, తాను ఎక్కడా రాజకీయం చేయలేదని, విజయబాబే రాజకీయాలు చేస్తున్నట్లు మాట్లాడారు కనుక మొదటిసారి రాజకీయ కోణంలో మాట్లాడుతున్నానని బుద్ధ ప్రసాద్ అన్నారు.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అధికార భాషా సంఘం ఏర్పాటు చేయకపోవడానికి కారణం తెలుగు ప్రాధికార సంస్థ ఏర్పాటు చేయమని కోరడమేనని...ఆ తర్వాత సాధికార సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రస్తుతం ప్రభుత్వంలో దాని ఉనికి కూడా ప్రశ్నార్థకమైనదని చెప్పుకొచ్చారు. కార్పొరేట్ విద్యాసంస్థల ఆధిపత్యాన్ని తాను ఈనాడే కాదు.. గతంలో నుండి ప్రశ్నిస్తూ వస్తున్నానని, ఆనాటి మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ ఇంగ్లీష్ మీడియం పురపాలక పాఠశాలలో పెట్టి, తెలుగు మీడియం తీసివేస్తే... ఆనాడు కూడా వ్యతిరేకించానని అన్నారు. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు మీడియం కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారన్నారు. నేడు వైఎస్ జగన్ పూర్తిగా తెలుగు మీడియం తొలగిస్తే విజయ్ బాబు సమర్థించడం భావ్యం కాదని, రాజ్యాంగం మాతృభాషల్లో చదువుకోవడానికి తెచ్చిన అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాలరాసిందని బుద్ధప్రసాద్ ప్రసాద్ మండిపడ్డారు.
పిల్లలు తమ పేర్లు కూడా తెలుగులో రాయలేని పరిస్థితి అధికార భాషా సంఘం దృష్టిలో లేదా అని బుద్ధప్రసాద్ ప్రశ్నించారు. తాను అధికార భాష సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వాణిజ్య సంస్థలపై తెలుగు నామఫలకాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని, కార్మిక శాఖ ద్వారా జరిమానాలు కూడా వేయించామని, కానీ ఇప్పటి పరిస్థితి గురించి వేరుగా చెప్పవలసిన అవసరం లేదని ఆయన అన్నారు. అధికార భాషను అమలు చేసిన అధికారులకు మా హయాంలో నగదు పురస్కారాలు అందజేసే వారమని, ఈ ప్రభుత్వంలో ఎవరికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. అధికార భాష సంఘం చేయవలసిన పని సాహితీవేత్తలకు సన్మానాలు కాదని, అధికార భాషను అమలు చేసిన అధికారులకు గుర్తించి, గౌరవించి ప్రోత్సహించడమని బుద్ధ ప్రసాద్ అన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో ఎన్ని జీవోలు తెలుగులో వచ్చాయో విజయబాబు తెలిపితే బాగుండేదని బుద్ధ ప్రసాద్ హితవు పలికారు.