ఈనెల 10న సీఐడీ విచారణకు లోకేశ్.. షరతులు ఇవే
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను సీఐడీ ఏ-14 నిందితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను సీఐడీ ఏ-14 నిందితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 4న విజయవాడలో విచారణకు హాజరుకావాలంట సీఐడీ గతనెల 30న నారా లోకేశ్‌కు ఢిల్లీలో నోటీసులు ఇచ్చింది. అయితే సీఐడీ ఇచ్చిన 41ఏ నోటీసులో పలు అంశాలపై లోకేశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో మంగళవారం మధ్యాహ్నం ఈ కేసు విచారణ జరిగింది. లోకేశ్ ప్రస్తుతం హెరిటేజ్‌లో షేర్ హోల్డర్ అని ఆయన తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదించారు. లోకేశ్‌కు తీర్మానాలు, బ్యాంక్ అకౌంట్ పుస్తకాలు ఇవ్వాలంటే కంపెనీ ప్రొసీజర్ ఉంటుందని కోర్టుకు తెలిపారు. లోకేశ్‌ను ఆ వివరాలు కోరడం సమంజసం కాదని వాదనలు వినిపించారు. అయితే తాము డాక్యుమెంట్లపై తాము ఎలాంటి ఒత్తిడి చేయడం లేదని లోకేశ్ ఈనెల 4న యధావిధిగా విచారణకు హాజరుకావాలని సీఐడీ తరఫు న్యాయవాది కోరారు. అయితే అందుకు లోకేశ్ తరఫు న్యాయవాది పోసాని అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు విచారణకు అంత తొందర ఎందుకని ప్రశ్నించారు. దీంతో ఇరువాదనలు విన్న హైకోర్టు ఈ నెల 10న లోకేశ్ సీఐడీ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
న్యాయవాది సమక్షంలోనే విచారణ
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విచారణపై సీఐడీకి ఏపీ హైకోర్టు పలు సూచనలు చేసింది. విచారణ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు చేయాలని ఆదేశించింది. ఈ విచారణ న్యాయవాది సమక్షంలోనే జరగాలని ఆదేశించింది. అలాగే మధ్యాహ్నం గంట పాటు లంచ్ బ్రేక్ ఇవ్వాలని సీఐడీకి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇకపోతే సీఐడీ ఇచ్చిన 41ఏ నోటీసుల్లో కొన్ని అంశాలపై లోకేశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటిని సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు హాజరయ్యేటప్పుడు హెరిటేజ్ సంస్థకు చెందిన తీర్మానాలు, అకౌంట్ బుక్స్ తీసుకురావాలని నోటీసుల్లో సీఐడీ పేర్కొనడాన్ని లోకేశ్ తప్పుబట్టారు. హెరిటేజ్ ఫుడ్స్ నుంచి తాను ఎప్పుడో బయటకు వచ్చానని...అలాంటప్పుడు వాటిని తానెలా తీసుకొస్తానని లోకేశ్ పిటిషన్‌లో పేర్కొన్నారు.