వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు
దివంగత మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ హత్యకేసులో....Latest News
దిశ, ఏపీ డైనమిక్ బ్యూరో: దివంగత మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ హత్యకేసులో నిందితులను హైదరాబాద్ సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. ఐదుగురు నిందితులను సీబీఐ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. వాదనలు విన్న సీబీఐ దర్మాసనం ముగ్గురు నిందితులను హైదరాబాద్ చంచల్ గూడ జైల్లో ఉండాలని ఆదేశించింది. ఇకపోతే ఈ హత్యకేసుకు సంబంధించి ఏ-1 గంగిరెడ్డి, ఏ- దస్తగిరిలు బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే. దస్తగిరి ఈ కేసులో అప్రూవర్‌గా మారాడు. ఇకపోతే ముగ్గురు నిందితులు ఏ2 సునీల్ కుమార్ యాదవ్, ఏ3 గజ్జల ఉమా శంకర్ రెడ్డి, ఏ5 దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డిలు వైఎస్ఆర్ కడప జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ హత్య కేసు విచారణ హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీకావడంతో వైఎస్ఆర్ కడప కేంద్ర కారాగారంలో ఉన్న ముగ్గురు నిందితులు, గంగిరెడ్డి, దస్తగిరిలను శుక్రవారం విచారించింది. రిమాండ్‌లో ఉన్న నిందితులను హైదరాబాద్ చంచల్ గూడ జైల్లో ఉంచాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది.
ఇకపోతే కేసు విచారణలో భాగంగా ఈ హత్యకేసులో నిందితులను కడప నుంచి హైదరాబాద్‌కు పోలీసులు తరలించారు. భారీ భద్రత నడుమ వైఎస్ఆర్ కడప సెంట్రల్ జైలు నుంచి తెల్లవారుజామున 4 గంటలకు నిందితులను నాలుగు ప్రత్యేక వాహనాల్లో పోలీసులు తరలించారు. 2019 మార్చి 15న వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలోని తన నివాసంలోనే మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అయితే ఈ కేసు విచారణ నిమిత్తం టీడీపీ ప్రభుత్వం సిట్‌ను నియమించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ సిట్‌ను రద్దు చేసి కొత్త సిట్‌ను విచారణకు నియమించింది. అయితే సిట్ విచారణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె హైకోర్టును ఆశ్రయించి సీబీఐ విచారణ కోరారు. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణ చేపట్టారు. అయితే విచారణ నెమ్మదించడంతో వైఎస్ సునీతారెడ్డి సీబీఐ చీఫ్ ను కలిసి వేగం పెంచాలని అభ్యర్థించిన సంగతి తెలిసిందే. అనంతరం ఈ కేసు విచారణలో భాగంగా అధికారులపై కేసులు నమోదు చేయడం.. అనుమానాస్పదంగా వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి వద్ద కొందరు వ్యక్తులు సంచరిస్తుండటంతో కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేయాలని సునీతారెడ్డి కోరగా అందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.