అదీప్‌ను వెంటాడుతున్న కబ్జాలు.. ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయా..?
అధికారం అండగా వైసీపీకి చెందిన పెందుర్తి నియోజకవర్గం యువ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ చేసిన భూ కబ్జాలు ఎన్నికల వేళ ఆయన్ను వెంటాడుతున్నాయి.
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: అధికారం అండగా వైసీపీకి చెందిన పెందుర్తి నియోజకవర్గం యువ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ చేసిన భూ కబ్జాలు ఎన్నికల వేళ ఆయన్ను వెంటాడుతున్నాయి. చిన్న వయసులోనే గెలిచినా భవిష్యత్తు గురించి ఆలోచించకుండా కబ్జాలను ప్రోత్సహించారు. తర్వాత గెలుస్తామో, లేదో.. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు ఎమ్మెల్యే అండగా ద్వితీయ శ్రేణి నేతలు, వారి అనుచరులు పెందుర్తి, సబ్బవరం, పరవాడలలో ఖాళీగా కనిపించిన ప్రతి ప్రభుత్వ భూమినీ కబ్జా చేసే ప్రయత్నం చేశారు.
కొన్నింటిని చేయగలిగారు. శ్మశానాలు, చెరువులు, దళితుల భూములు, దేవుడి భూములు, ప్రభుత్వ భూములు వంటివి ఏది కనపడితే అదే కాదేదీ కబ్జాకు అనర్హం అనే రీతిలో చెలరేగి పోయారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ప్రభుత్వ పెద్దలు, అధికారుల అండతో కబ్జా కాండ సాగించారు. వందలాది ఎకరాల భూములను చెరపట్టారు. వాటికి తమ పేర్లు, బినామీల పేర్లతో హస్తగతం చేసుకున్నారు.
సబ్బవరంలోనే వందల ఎకరాలు
ఒక్క సబ్బవరం మండలంలోనే సుమారు 250 ఎకరాలకు పైగాప్రభుత్వ భూములను కబ్జా చేశారంటే ఏ స్థాయిలో రెచ్చి పోయారో అర్థం చేసుకోవచ్చు. సబ్బవరం మండలంలోని సర్వే నెంబర్ 255 లో గల గెడ్డ పోరంబోకు స్థలం తొమ్మిది ఎకరాల 74 సెంట్లు, సర్వే నెంబర్ 260లో గల గెడ్డ పోరంబోకు పది ఎకరాల పదహారు సెంట్లు కబ్జా తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. ఇదే మండలంలోని సర్వే నెంబర్ 271లో గల గెడ్డ పోరంబోకు స్థలం 88 ఎకరాల ఇరవై సెంట్లు, సర్వే నెంబర్ 286లో గల కొండ పోరంబోకు 122 ఎకరాల ఎనభై సెంట్ల స్థలం ఎమ్మెల్యే అతని బంధుగణం చేసిన కబ్జా చేశారనే చర్చ జరుగుతోంది.
సత్రం భూములూ వదల్లేదు
సర్వే నెంబర్ 272,273లో గల సుమారు ఐదు ఎకరాల గయళ్ళు, సర్వే నెంబర్ 246, 247లలో గల సుమారు రెండు ఎకరాల ధర్మసత్రం, సంతబయలు స్థలం ఎవరు కబ్జా చేశారో గుర్తు చేసుకోవాలని స్థానికులు అంటున్నారు. మొత్తం మీద ఒక్క సబ్బవరం మండలంలోనే 250 ఎకరాలకు పైగా హాంఫట్ చేసిన అదీప్ అతని అనుచరుల భూ కబ్జాలు ఇప్పుడు ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారాయి.
ఎన్నికల అంశంగా..
బంధుగణం, కోటరీ అండగా సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ కబ్జాకాండ ఎన్నికల ప్రచారంలో అతనిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పెందుర్తి చరిత్రలోనే ఈ స్థాయిలో భూ కబ్జాలు చేసిన ఎమ్మెల్యే మరొకరు లేరంటూ స్థానికులు చర్చించుకొంటున్నారు. ఒక్క మండళ్లల్లోనే రెండొందల ఎకరాలకు పైగా ఉంటే నియోజకవర్గం మొత్తంలో ఇంకెన్ని ఎకరాలు మింగేశారోననే చర్చ నడుస్తోంది. కొండ ప్రాంతాల్లో జరిగిన అక్రమ మైనింగ్ దీనికి తోడైంది. రెండు రోజుల క్రితం పెందుర్తి ఎన్నికల సభలో మాట్లాడిన జన సేనాని పవన్ కళ్యాణ్ ఇక్కడ మూడు కబ్జాలు.. ఆరు ఆక్రమణలు అని విమర్శించారు.