వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన మైలవరం ఎమ్మెల్యే
మైలవరంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది.
దిశ, వెబ్ డెస్క్: వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబును సీఎంగా చూడాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. వైసీపీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని తెలిపారు. మైలవరంలో మళ్లీ తానే ఎమ్మెల్యేగా గెలుస్తానన్నారు. సర్వేలన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఏపీలో అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని వసంత కృష్ణ ప్రసాద్ ఆకాంక్షించారు.
కాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు చాలా ఏళ్లు టీడీపీలో పని చేశారు. పలు పదవులు సైతం అనుభవించారు. అయితే వైఎస్ జగన్ పార్టీ పెట్టడంతో ఆయన వైసీపీలో చేరారు. ఆయనతో పాటు తనయుడు వసంత కృష్ణ ప్రసాద్ సైతం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ మేరకు 2019 ఎన్నికల్లో వసంత కృష్ణప్రసాద్ అప్పటి మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమపై పోటీ చేసి గెలుపొందారు.
అయితే ఇటీవల వైసీపీ ఇంచార్జుల నియామకంలో వసంత కృష్ణ ప్రసాద్‌కు భంగపాటు కలిగింది. వైసీపీ అధిష్టానం మైలవరం ఇంచార్జిగా మరొకరిని నియమించడంతో వసంత కృష్ణ ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎమ్మల్యేగా ఉన్న తనకు సీఎం జగన్ తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కార్యకర్తలతో సమావేశం నిర్వహించి టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు చంద్రబాబు సమక్షంలో శనివారం ఉదయం టీడీపీలో జాయిన్ అయ్యారు. ఇక మైలవరం నుంచి పోటీ చేసేది వసంత కృష్ణప్రసాద్‌నా, దేవినేని ఉమనా అనేది తేలాల్చి ఉంది.