AP News: ఇది ట్రాక్ రికార్డ్ కాదు.. ఆల్ టైం రికార్డ్!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డీఎన్ఏలో కుళ్లు కుతంత్రం, మోసం, నయవంచన తప్ప మరేమీ లేదంటూ మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. ...
దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డీఎన్ఏలో కుళ్లు కుతంత్రం, మోసం, నయవంచన తప్ప మరేమీ లేదంటూ మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. జయహో బీసీ మహాసభలో పాల్గొన్న ఆయన చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఏనాడు బీసీలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టలేదన్నారు.
బీసీల సంక్షేమానికి పథకాలు అమలు చేయకుండా మభ్యపెట్టారని విమర్శించారు. చంద్రబాబు తన డీఎన్‌ఏలో బీసీలు ఉన్నారని.. తన గుండెల్లో బీసీలు ఉన్నారని అబద్దాలు చెప్పారన్నారు. బీసీల సంక్షేమం కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టిన వైఎస్ జగన్ అసలైన బీసీల బంధువు అని చెప్పుకొచ్చారు. ఈ రోజు బీసీలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు... బీసీలకు జగనన్న చేస్తున్న సేవ ట్రాక్ రికార్డ్ కాదని.. ఆల్ టైం రికార్డ్ అని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. తాట తీస్తా అంటూ బీసీలను అవమానకరంగా మాట్లాడిన చంద్రబాబును ఈ జన్మలో బీసీలు నమ్మే పరిస్థితి లేదన్నారు. వెనకబడ్డ కులాల వెన్నంటి నిలిచి వారిని ముందుకు నడిపిస్తున్న జగనన్న వెంటే బీసీ జన ప్రభంజనం కదంతొక్కుతోందని స్పష్టం చేశారు.
కృష్ణుడిలో బుద్ధిబలం...అర్జునుడిలో వీరత్వం.. కర్ణుడిలో కరుణ... భీముడిలో ధైర్యం... ధర్మరాజులో ధర్మం.. చాణక్యుడిలో రాజనీతి అన్నీ కలగలిపితే సీఎం వైఎస్ జగన్ అని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైసీపీని గెలిపించుకుందామని... వైఎస్ జగన్‌ను మరోసారి సీఎం పీఠంపై కూర్చోబెడదామని పిలుపునిచ్చారు. మన టార్గెట్175కి 175లో గెలుపొందడమేనని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ జయహో మహాసభ వేదికగా బీసీలకు పిలుపు ఇచ్చారు.