Vijayawada Temple: వైభవంగా శత చండీ సహిత మహారుద్రయాగం
ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో శత చండీ సహిత మహారుద్రయాగం జరిగింది....
దిశ, డైనమిక్ బ్యూరో: ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో శత చండీ సహిత మహారుద్రయాగం జరిగింది. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఈ నెల 2 నుండి 6 వరకు 5 రోజులపాటు ఈ మహారుద్రయాగం నిర్వహించారు. సోమవారం మంటప పూజలు, రుద్ర హవనము, చండీ హోమం, మూల మంత్ర హవనములు నిర్వహించారు. అనంతరం మహాపూర్ణహుతి, తదనంతరం కలశోద్వాసన చేసి కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు దంపతులు, ఈవో భ్రమరాంబ, ట్రస్ట్ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నాటి రాంబాబు మాట్లాడుతూ.. లోకకళ్యాణార్థం సంకల్పించి శత చండీ సహిత మహారుద్రయాగం 2న గణపతి పూజతో ప్రారంభమైందని చెప్పారు. నేడు పూర్ణాహుతి, వేదపండితులచే ఆశీర్వచనం తదితర వైదిక కార్యక్రమములతో ముగిసిందని పేర్కొన్నారు. కార్యక్రమములన్నీ అర్చక సిబ్బంది శాస్త్రోక్తముగా నిర్వహించారని, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషములతో ఉండాలని ప్రార్థించినట్లు కర్నాటి రాంబాబు తెలిపారు.
ఈ యాగ కార్యక్రమంలో 58 మంది వైదిక, అర్చక సిబ్బంది పాల్గొని అత్యంత దీక్షతో యాగ కార్యక్రమములు నిర్వహించడం జరిగిందని ఈవో భ్రమరాంబ తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల లోక కల్యాణం జరిగి పాడిపంటలు, సుఖసంతోశాములతో లోకమంతా సుభిక్షంగా ఉంటుందని ఆమె చెప్పారు.