AP News: వల్లభనేని వంశీకి Janasena Leaders వార్నింగ్
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌పై కృష్ణా జిల్లా జనసేన పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే వంశీ జనసేనానిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు...
దిశ, డైనమిక్ బ్యూరో: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌పై కృష్ణా జిల్లా జనసేన పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే వంశీ జనసేనానిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. అసలు రాజకీయాల్లో వల్లభనేని వంశీ స్థాయి ఏంటో తెలుసుకోవాలని హితవు పలికింది. పవన్ కల్యాణ్‌ను విమర్శించే స్థాయి వల్లభనేని వంశీమోహన్‌కు లేదని జనసేన పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలో శనివారం జనసేన నేతలు బండిరెడ్డి రామకృష్ణ, సంధ్య ఇతర నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు.
పవన్ కల్యాణ్‌పై ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని ఎమ్మెల్యే వంశీకి జనసేన నేతలు వార్నింగ్ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో వంశీ ఓటమి పాలవ్వడం ఖాయమని ఈ విషయం తెలుసుకుని పదే పదే పవన్ కల్యాణ్‌పై విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వంశీని ఓడించే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తున్న వల్లభనేని వంశీ 2024లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో తెలుసా అని ప్రశ్నించారు. గెలిచింది టీడీపీ... తిరిగేది వైసీపీలో తమరా చెప్పేది అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ప్రజలకు వల్లభనేని వంశీ తెలియజేయాలని సూచించారు. నాయకుడు అంటే ఏమిటో తెలియని స్థానంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉన్నారని కృష్ణా జిల్లా జనసేన పార్టీ నేతలు ఎద్దేవా చేశారు. మరోవైపు ఆదివారం సత్తెనపల్లి నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాన్ నిర్వహించబోయే కౌలు రైతు భరోసాయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సత్తెనపల్లిలో కౌలు రైతు భరోసా యాత్ర జరుగుతుందని తెలిసి వైసీపీ, టీడీపీల మధ్య గొడవ సృష్టించి యాత్ర ఆపే ప్రయత్నం వైసీపీ చేసిందని నేతలు ఆరోపించారు. కోనసీమలో గొడవ చేశారని..గుంటూరు జిల్లా ఇప్పటంలో రాద్ధాంతం చేశారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ఈ యాత్రను ఆపడం వైసీపీ వల్ల కాదని కృష్ణా జిల్లా జనసేన నేతలు హెచ్చరించారు.