Kondapally VTPS: ముగ్గురు కార్మికుల ప్రాణం తీసిన లిఫ్ట్

పొట్టకూటికోసం ఊరుకాని ఊరు వచ్చారు. ధర్మల్ పవర్ స్టేషన్‌లో ఐదవ్ ఫేజ్ నిర్మాణ దశ పనులు చేస్తున్నారు...

Update: 2023-03-18 10:13 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పొట్టకూటికోసం ఊరుకాని ఊరు వచ్చారు. ధర్మల్ పవర్ స్టేషన్‌లో ఐదవ్ ఫేజ్ నిర్మాణ దశ పనులు చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో పనులు పూర్తి అవుతాయి. ఈ నేపథ్యంలో కార్మికులు మిగిలిన పనులను పూర్తి చేసేందుకు వెచ్చారు. లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్లేందుకు ప్రయత్నించగా వైరు తెగిపడి వారిలో ముగ్గురు మృతి చెందారు. బతుకు దెరువుకోసం తమతోపాటే పనికి వచ్చిన వారిలో ముగ్గురు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తోటి కార్మికులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

ఈ విషాద ఘటన ఉమ్మడి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం కొండపల్లి వీటీపీఎస్‌లో జరిగింది. థర్మల్ పవర్ స్టేషన్‌లో లిఫ్ట్ వైరు తెగి కిందకు పడి ముగ్గురు దుర్మరణం చెందగా మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొండపల్లి విజయవాడ ధర్మల్ పవర్ స్టేషన్‌లో ధర్మల్ పవర్ స్టేషన్ ఐదవ ఫేజ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గత నాలుగేళ్లుగా జరుగుతున్న ఈ పనులు చివరి దశకు వచ్చాయి. పనులు ముమ్మరంగా సాగుతున్న వేళ నిర్మాణ పనుల కోసం లిఫ్ట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా 8 మంది కార్మికులు లిఫ్ట్‌లో పైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. నాలుగో ఫ్లోర్ వెళ్లేసరికి లిఫ్ట్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో కార్మికులు తలుపులు తీసుకుని బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఇంతలో ఒక్కసారిగా లిఫ్ట్ వైరు తెగిపడి లిఫ్ట్ కిందకు పడిపోయింది.

ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. వీరిలో ఐదుగురికి సీరియస్‌గా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. స్వల్పంగా గాడయపడిన వారిని ఎన్టీపీసీలోని ఆస్పత్రికి తరలించగా ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మృతులు, క్షతగాత్రులు ఝార్ఖండ్‌ వాసులుగా పోలీసులు గుర్తించారు.

Tags:    

Similar News