YSRCPలో 'కమ్మ' ప్రకంపనలు.. తండ్రి రివర్స్ గేర్.. ఇరకాటంలో కుమారుడు
రాష్ట్రంలో మరో 16 నెలల్లో ఎన్నికలు రానున్నాయి. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ క్లీన్ స్వీప్ చేసే దిశగా వ్యూహరచన చేస్తున్నారు. ...
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో మరో 16 నెలల్లో ఎన్నికలు రానున్నాయి. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ క్లీన్ స్వీప్ చేసే దిశగా వ్యూహరచన చేస్తున్నారు. అయితే ఇలాంటి తరుణంలో పార్టీలోని అసమ్మతి బయటపడుతుండటం కలవరపాటుకు గురి చేస్తోంది. తాజాగా మాజీమంత్రి, వైసీపీ కీలక నేత వసంత నాగేశ్వరరావు ఒక్కసారిగా పార్టీపైనా.. సీఎం జగన్ నిర్ణయంపైనా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడు రాజధానుల నిర్ణయాన్ని బాహాటంగానే తప్పుబట్టారు. డా.ఎన్టీఆర్ యూనివర్సిటీఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరు మార్పును వ్యతిరేకించారు. అటు జగన్ కేబినెట్‌లో కమ్మ సామాజిక వర్గానికి చోటు కల్పించకపోవడంపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కమ్మ వారంతా ఐక్యంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. కమ్మ సామాజిక వర్గాన్ని అంతటిని ఏకతాటిపైకి తీసుకువచ్చేలా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ హాట్‌గా మారాయి.
అయితే వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. తనయుడు వసంత కృష్ణప్రసాద్‌కు కేబినెట్‌లో చోటు కల్పించకపోవడంతోనే ఇలా మాట్లాడుతున్నారంటూ పలువులు వైసీపీ నేతలు అటున్నారు. అందులో భాగంగానే కమ్మ సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చేలా అగ్గిరాజేస్తున్నారని చెబున్నారు. అయితే తండ్రి వ్యాఖ్యలపై కుమారుడు, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సైతం వివరణ ఇచ్చారు. తాను వైసీపీలోనే కొనసాగుతానని క్లారిటీ ఇచ్చారు. మెుత్తానికి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు టీ కప్పులో తుఫాన్‌లా ఆగిపోతుందా లేక తీవ్ర వాయుగుండంగా మారి వైసీపీకి విఘాతంగా మారుతుందా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్‌లో జరుగుతుంది.
ఎన్టీఆర్ పేరు మార్పుపైనా అసహనం
డా.ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరు మార్పుపైనా మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు అసహనం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదని.. అందరికీ చెందిన మహానాయకుడని కొనియాడారు. అలాంటి మహనీయుడు పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టాల్సిన అవసరం ఏముందన్నారు. యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును మార్చడం చాలా బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ప్రారంభోత్సవంలో తాను కూడా మంత్రిగా పాల్గొన్నట్లు గుర్తు చేశారు. కేబినెట్ మంత్రులను నాటి సీఎం ఎన్టీఆర్ ఎంతో గౌరవించేవారని చెప్పారు. అక్కడ శిలా ఫలకాలపై తన పేరు, ఎన్టీఆర్ పేరు, నాటి ఆరోగ్యశాఖ మంత్రి పేరు ఇప్పటికీ ఉన్నాయన్నారు. కానీ వ్యవస్థల పేర్లు మార్చిన చరిత్ర గతంలో లేదని ఇప్పుడే దాపురించిందన్నారు. ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు విషయంలో ఎవరూ స్పందించకపోవడంపైనా అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, వైఎస్ఆర్ పేర్లతో అనేక నిర్మాణాలు ఉన్నాయని.. కానీ ఏ ప్రభుత్వం వారి పేర్లను మార్చే ప్రయత్నం చేయలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన ముఖ్యమంత్రులు ఎవరు ఇలా పేర్లు మార్చే పనులు చేయలేదన్నారు. పేర్లు మార్చడం వల్ల ఓ వర్గాన్ని అకారణంగా దూరం పెడుతున్నట్లు భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు కమ్మ వర్గం పై రాజకీయంగా దాడి జరుగుతున్నట్లు అనిపిస్తోంది. అయినప్పటికీ కమ్మ సామాజిక వర్గం నేతలు ఎందుకు స్పందించడం లేదని మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు నిలదీశారు
కేబినెట్‌లో కమ్మవారికి చోటు కల్పించకపోవడంపై మండిపాటు
మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేబినెట్ విస్తరణపైనా మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి వర్గ కూర్పుపై మండిపడ్డారు. కేబినెట్‌లో కమ్మ కులానికి ప్రాతినిథ్యం లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ చర్యలను పరిశీలిస్తే సీఎం జగన్ కమ్మ వర్గానికి అన్యాయం చేస్తు్న్నట్లు అనిపిస్తోందన్నారు. కమ్మవారి రాష్ట్రం అయ్యిండి, ఒక్క మంత్రి కూడా లేకపోవడం బాధాకరమన్నారు. కమ్మవారికి ఎందుకు చోటు కల్పించలేదని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌ని కమ్మ సామాజిక వర్గంలో దాదాపు 35 శాతం మంది ఓటర్లు ఆదరించారని వసంత గుర్తు చేశారు. అన్ని సామాజిక వర్గాలను కలుపుకుపోవాల్సిన బాధ్యత సీఎంపై ఉందని హితవు పలికారు. 2004 ఎన్నికల్లో తాను ఓడిపోతే దివంగత సీఎం వైఎస్ఆర్ ఆప్కాబ్ చైర్మన్‌గా నియమించిన విషయాన్ని ప్రస్తావించారు. అన్ని వర్గాలను వైఎస్ గౌరవించే వారని.. నాటి కేబినెట్‌లో ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి వైఎస్ చోటు కల్పించిన విషయాన్ని వసంత నాగేశ్వరరావు స్పష్టం చేశారు. పక్క రాష్ట్రాల్లో కమ్మవారు కీలకమైన పదవుల్లో ఉన్నారని గుర్తు చేశారు. మధ్యప్రదేశ్‌లో కమ్మవారికి మంత్రి పదవులు దక్కాయంటూ మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుండబద్దలు కొట్టారు.
కొడుకు పదవి దక్కలేదని అక్కసుతోనేనా..
తెలుగుదేశం, కాంగ్రెస్ హయాంలో వసంత నాగేశ్వరరావు మంత్రిగా పనిచేశారు. కీలకమైన హోంశాఖ మంత్రిగా పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆప్కాబ్ చైర్మన్‌గా వ్యవహరించారు. అనంతరం టీడీపీలో చేరడం ఆ తర్వాత 2018 మే 10న వసంత నాగేశ్వరరావు తనయుడు వసంత కృష్ణప్రసాద్‌తో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కైకలూరులో వైఎస్ జగన్ పర్యటిస్తుండగా వసంత నాగేశ్వరరావు తనయుడు కృష్ణప్రసాద్‌తో కలిసి పార్టీలో చేరారు. అనంతరం 2019 ఎన్నికల్లో మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్ పోటీచేసి మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుపై గెలుపొందారు. అయితే మంత్రివర్గంలో వసంత కృష్ణప్రసాద్‌కు చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ దక్కలేదు. పోనీ విస్తరణలోనైనా దక్కుతుందేమోనని ఆశించారు. కొడాలి నానికి ఉద్వాసన పలకడంతో అదే సామాజిక వర్గానికి చెందిన కృష్ణప్రసాద్‌కు చోటు కల్పిస్తారని ఆశించినప్పటికీ ఆ ఆశలు ఫలించలేదు. కుమారుడికి మంత్రి పదవి దక్కలేదని మాజీమంత్రి వసంత నాగేశ్వరరావు ఇలా మాట్లాడారా లేక వేరే కోణం ఏమైనా అయి ఉంటుందా అన్న కోణంలో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కుమారుడి కోసమే అయితే కమ్మవారంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది...ఇంకెంతకాలం పల్లకీలు మోస్తాం వంటి వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలు వెనుక ఏదైనా రాజకీయ కోణం ఉందా అన్న కోణంలో తాడేపల్లి టీం పరిశీలిస్తు్న్నట్లు రాజకీయ వర్గాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
అమరావతికి జై కొట్టిన వసంత
రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేయడం మంచి నిర్ణయమని మాజీమంత్రి వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. రాష్ట్రం మధ్యలో ఉన్న అమరావతి రాజధానికి అనువైన ప్రాంతమని, అందరికీ అది అందుబాటులో ఉంటుందని చెప్పుకొచ్చారు. అమరావతి రాష్ట్రాభివృద్ధికి చిహ్నమని చెప్పుకొచ్చారు. ఇందులో వివాదం ఏమీ లేదని అభిప్రాయపడ్డారు. అమరావతిలో రైతులు రూపాయి తీసుకోకుండా రాజధాని కోసం 32వేల ఎకరాలు ఇచ్చిన ఘనత ప్రపంచంలో ఎక్కడా లేదని.. వారి త్యాగానికి మాజీమంత్రి జేజేలు పలికారు. అంతేకాదు విజయవాడలో రైల్వే జంక్షన్.. ఎయిర్‌పోర్టు, కృష్ణా నది ఇలా అన్నీ అందుబాటులో ఉన్నాయని కాబట్టి అమరావతియే ఏకైక రాజధానిగా ఉండాలని మాజీమంత్రి వసంత నాగేశ్వరరావు ఆకాంక్షించారు.
Read more:
అద్దె ఇవ్వమంటే చంపేస్తామంటున్నారు.. Jc Prabhakar Reddyపై ఫిర్యాదు
ఏపీ కేబినెట్‌లో 'కమ్మ'కేది చోటు?..Vasantha Nageswara Rao సంచలన వ్యాఖ్యలు