జైలుకు వెళ్లేందుకూ సిద్ధమే: Pawan Kalyan
ఏపీకి జగన్ భవిష్యత్ కాదని..విపత్తు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు...
దిశ, ఏపీ బ్యూరో: ఏపీకి జగన్ భవిష్యత్ కాదని..విపత్తు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తాను పదవులపై ఆశపడి రాజకీయాల్లోకి రాలేదని, వైసీపీ కేసులకు తాను భయపడనని, జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర కృష్ణా జిల్లా పెడనలో సాగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జగన్ ఓట్ల కోసమే పథకాలు అమలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వమని విమర్శించారు. సీఎం జగన్ ఒంట్లో పావలా దమ్ము లేదన్నారు. రాష్ట్రంలో రాబోయేది జనసేన-టీడీపీ ప్రభుత్వమేనన్నారు. డబ్బులిస్తే అభివృద్ధి జరిగినట్టా ? అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మార్గాలేవని నిలదీశారు. తాను పదవులపై ఆశపడి ఉంటే 2009లోనే ఎంపీ పదవిలో ఉండేవాడినన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉపాధి కూలీల పొట్ట కొట్టిందన్నారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎక్కువ రాజద్రోహం కేసులు ఏపీలోనే పెట్టడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి కేసులకు భయపడితే తాను రాజకీయాల్లోకి ఎందుకు వస్తానన్నారు.
వైసీపీకి కొమ్ముకాస్తున్న పోలీసులు
చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు నేను ఏసీబీ కోర్టుకు వెళ్తానని మీకు ఎవరు చెప్పారని, పోలీసులు వైసీపీకి కొమ్ముకాస్తున్నారని, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను నేను ఎన్నోసార్లు కలిశానని పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ గురించి చెప్పాలనుకుంటే ఎప్పుడో చెప్పేవాడినని, ఎక్కడ ట్యాక్స్ కట్టలేదో జీఎస్టీ వాళ్లకు తెలుసన్నారు. అలాంటిది ఏపీలో ఏం జరుగుతుందో కేంద్రానికి, ప్రధానికి తెలుస్తుందన్నారు. కానీ వారి పరిస్థితులేంటో అర్థం చేసుకోవచ్చన్నారు. పులివెందుల అంటే ఒకప్పుడు సరస్వతి నిలయమని, అలాంటి చదువుల నేలను ప్రస్తుతం గొడవలకు కేంద్రం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, అరెస్టు చేసినా పర్లేదన్నారు. ఎక్కడికైనా వస్తాను..ప్రజల డబ్బులను వాలంటీర్లకు దోచిపెడుతున్నారని, లక్షల కోట్లు జగన్ దోచేశారని ఆరోపించారు.