Vellampally: అలా జరిగితే..చంద్రబాబు, పవన్ ఇక హైదరాబాద్‌కే
రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసే దమ్ము పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడుకు లేదని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ...
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసే దమ్ము పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడుకు లేదని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. వైసీపీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబుతో టచ్‌లో ఉంటే 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయొచ్చు కదా అని సవాల్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు 60 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు 40 మంది మాత్రమే టచ్‌లో ఉన్నారని మిగిలిన 20 మంది ఏమయ్యారని ప్రశ్నించారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆదివారం వైఎస్ఆర్ ఆసరా పథకం కింద మూడో విడత నిధులను లబ్ధిదారులకు మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పంపిణీ చేశారు. ముందస్తు ఎన్నికలు వెళ్లాల్సిన అవసరం వైసీపీకి లేదని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ క్యాడర్ అంతా నిరుత్సాహంలో ఉందని, ఈ నేపథ్యంలోనే క్యాడర్‌లో ఉత్సాహం నింపేందుకు చంద్రబాబు ముందస్తు ఎన్నికల అంశాన్ని పదేపదే తెరపైకి తీసుకువస్తున్నారని చెప్పారు.
మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి వాహనంపై సెటైర్లు వేశారు. వారాహి వాహనం ఉందా ఆమ్మేశాడా అంటూ హేళన చేశారు. చంద్రబాబు ఎండలు చూడలేడు.. దత్తపుత్రుడు బయటకు రాలేడని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ 175 స్ధానాలు గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత చంద్రబాబును ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్‌ను హైదరాబాద్‌కు పంపిచేస్తామని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు.