Ap News: వారి చేతుల్లోనే అధికారాలు.. మరో బాంబ్ పేల్చిన ఉద్యోగులు

ప్రభుత్వంపై ఉద్యోగులు మరో సంచలన ఆరోపణలు చేశారు. ...

Update: 2023-03-05 13:14 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వంపై ఉద్యోగులు మరో సంచలన ఆరోపణలు చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో సంస్కరణల పేరుతో అధికారాల కేంద్రీకరణ జరుగుతుందని ఆరోపణలు చేశారు. అన్ని అధికారాలు కేవలం నలుగురైదుగురు ఉన్నతాధికారుల చేతుల్లో పెట్టే విధంగా మంత్రాంగం నడుపుతున్నారని వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ ఆరోపించారు. క్షేత్రస్థాయిలోని సర్కిల్ కార్యాలయాలకు ఉన్న అధికారాలన్నీ తొలగించి వాటిని నిర్వీర్యం చేయడం ద్వారా ఆ శాఖను బలహీనపరుస్తున్నారని సూర్యనారాయణ ఆరోపించారు.

వాణిజ్య పన్నుల శాఖలో తిరోగమన చర్యలు 

విజయవాడ మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో కేఆర్ సూర్యనారాయణ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో సింహభాగాన్ని సమకూరుస్తున్న వాణిజ్య పన్నుల శాఖలో తిరోగమన చర్యలు చేపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ విధానంతో ఉద్యోగుల మనోస్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు, వాణిజ్య పన్నుల శాఖ ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. హేతుబద్ధత లేని నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ చర్యలపై నిరసనగా వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు దశలవారీ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టనున్నారని సూర్యనారాయణ వెల్లడించారు. వాణిజ్య పన్నుల శాఖలో 770రిపైగా ఏసీటీవోలకు ఎటువంటి చట్టబద్ధ అధికారాలు లేకుండా చేయడం వల్ల క్షేత్రస్థాయిలో జి.ఎస్.టి.చట్టం అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. కాబట్టి ఈ అధికారుల సేవలు గరిష్ఠ స్థాయిలో ఉపయోగించుకొనే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సూర్యనారాయణ కోరారు. సర్కిల్ కార్యాలయాలకు సరైన అధికారాలు కల్పించి బలోపేతం చేయాలన్నారు.

అధికారాల కేంద్రీకరణ విరమించుకోవాలి

అధికారాల కేంద్రీకరణను విరమించుకోవాలని, ఉద్యోగుల బదిలీలలో అవకతవకలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. శాఖ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ హేతుబద్ధంగా చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులపై ఉన్న అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయాలని, అప్పటి వరకు వారిని ఈ బాధ్యతల నుంచి తప్పించాలని కోరారు. క్రమశిక్షణ చర్యల పేరుతో క్రిందిస్థాయి ఉద్యోగులను అకారణంగా వేధిస్తున్నారని పలువురు ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ నెల రెండవ వారం నుండి దశల వారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని కూడా సమావేశం తీర్మానించింది.

Tags:    

Similar News