పొలిటికల్ ఫ్యూచర్‌పై కొత్తపల్లి కన్ఫ్యూజన్ : టీడీపీనా?జనసేనలోకా?

ఏపీ రాజకీయాల్లో ఆయనో సీనియర్ నేత. ఐదుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు.

Update: 2023-10-17 12:43 GMT

దిశ, డైనమిక్ బ్యూరో :  ఏపీ రాజకీయాల్లో ఆయనో సీనియర్ నేత. ఐదుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. ఒకసారి ఎంపీగా కూడా గెలుపొందారు. టీడీపీ హయాంలో మంత్రిగానూ పనిచేశారు. టీడీపీలో ఓ వెలుగు వెలుగొందుతున్న ఆయన 2009లో పీఆర్పీలో చేరారు. పీఆర్పీ విలీనం అనంతరం కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 2014లో తిరిగి టీడీపీలో చేరారు. అనంతరం టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. వైసీపీ అధిష్టానం బహిష్కరణ వేటు వేయడంతో ప్రస్తుతం ఆ సీనియర్ పొలిటీషియన్ సైలెంట్ అయిపోయారు. వైసీపీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని తెగేసి చెప్తున్నారు. ఇంతకీ సదరు మాజీమంత్రి ఏ పార్టీలో చేరతారని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పక్కన ప్రత్యక్ష మవ్వడం సంచలనంగా మారింది. రాజకీయ ఆరంగేట్రం చేసిన టీడీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇంతకీ ఆ సదరు మాజీమంత్రి, సీనియర్ పొలిటీషియన్ ఎవరో అర్థమయ్యే ఉంటుంది కదూ.. ఇంకెవరు కొత్తపల్లి సుబ్బారాయుడు. వైసీపీకి గుడ్ బై చెప్పేసిన అనంతరం.. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీకి దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉన్నారేమో అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. టీడీపీ నేతలతో మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు టచ్‌లోకి వెళ్తుండటంతో టీడీపీలో బెర్త్ దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ గట్టిగా వినబడుతోంది.

సీనియర్ పొలిటీషియన్

మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ పొలిటీషియన్. ఉభయగోదావరి జిల్లా రాజకీయాలను ఒకప్పుడు ప్రభావితం చేసే నాయకులలో కొత్తపల్లి సుబ్బారాయుడు ఒకరు. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలలో కొత్తపల్లి సుబ్బారాయుడు కీలకమైన నాయకుడు. కొత్తపల్లి సుబ్బారాయుడు నర్సాపురం నియోజకవర్గంలో 1989 ఎన్నికల్లో పోటీచేసి విజయాన్ని అందుకున్నారు. అప్పటి నుంచి వరుసగా నాలుగుసార్లు అక్కడ నుంచే గెలుపొందారు. అంతేకాదు చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా కూడా పని చేశారు. అయితే కొత్తపల్లి సుబ్బారాయయుడు 2009 ఎన్నికలకు ముందు టీడీపీని వీడి పీఆర్పీలో చేరారు. ఆ ఎన్నికల్లో నర్సాపురం నుంచి పోటీ చేసి ఘోరంగా ఓటమి పాలయ్యారు. అనంతరం జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి విజయం సాధించారు. కొత్తపల్లి సుబ్బారాయుడు 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఎన్నికల్లో నర్సాపురం నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్థి మాధవనాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం తిరిగి టీడీపీలో చేరారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి చేపట్టారు. 2019 ఎన్నికలకు ముందు మళ్లీ వైసీపీలో చేరారు. నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు గెలుపులో కీలక పాత్ర పోషించారు. అనంతరం ముదునూరితో విభేదాల నేపథ్యంలో వైసీపీపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీ అధిష్టానం కొత్తపల్లి సుబ్బారాయుడుని పార్టీ నుంచి బహిష్కరించింది. అయితే కొత్తపల్లి సుబ్బారాయుడు 2024లో ఖచ్చితంగా పోటీ చేసి తీరుతానని ప్రకటించారు.

టీడీపీలో చేరతారా?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వేటుకు గురైన కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీలోకి టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో టీడీపీ ముఖ్యనేతలతో టచ్‌లోకి వెళ్లారు. నారా లోకేశ్‌తో కలిసిన ఫోటోలు సైతం వైరల్ అయ్యాయి. మరోవైపు చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పైనా తీవ్ర వ్యాక్యలు చేశారు.చంద్రబాబు అరెస్టు ఉద్దేశపూర్వకంగా, కక్ష పూరితంగా జరిగిందని ఆరోపించారు. చంద్రబాబు అరెస్టు తీరు తెలుగు ప్రజలను కలిచివేసిందని.. అరెస్టు ఒక ప్రొసీజర్ ప్రకారం జరగలేదని వ్యాఖ్యానించారు. అదే సందర్భంలో జైల్లో చంద్రబాబుకు భద్రత లేదని.. ఎన్ఎస్‌జీ సెక్యూరిటీ ఉన్న నేతను క్రిమినల్స్ ఉన్న సెంట్రల్ జైల్లో ఉంచటం ఎంతవరకు సమంజసమని కూడా కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రశ్నించారు. అదే సందర్భంలో ములాఖత్‌లో భాగంగా చంద్రబాబు నాయుడును కలిసి పవన్ కల్యాణ్ సంఘీభావం ప్రకటించడంతోపాటు పొత్తును ప్రకటించడం అభినందనీయమన్నారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని పవన్ చేసిన ప్రకటన టీడీపీ, జనసేన వర్గాలలో ఉత్సాహాన్ని నింపాయని కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పుకొచ్చారు. దీంతో కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీలో చేరడం ఖాయమనే ప్రచారం జరుగుతుంది.

టికెట్‌పై త్రిముఖ పోరు

ఇదిలా ఉంటే కొత్తపల్లి సుబ్బారాయుడు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తామని ఢంకా భజాయించి చెప్తున్నారు. మరి అలాంటి కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీలో చేరితే నరసాపురం టికెట్ దక్కుతుందా అనే చర్చ జరుగుతుంది. నరసాపురం నుంచి ఇప్పటికే ఇద్దరు నేతలు టికెట్ రేసులో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, పార్టీ ఇన్‌చార్జి పొత్తూరు రామరాజులు పోటీలో ఉన్నారు. ఇద్దరి నేతల మధ్య టికెట్ పోరు తారాస్థాయికి చేరింది. ఇలాంటి తరుణంలో కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా టీడీపీలోకి వస్తే టికెట్ రేసులో త్రిముఖ పోరు వచ్చే అవకాశశం ఉందని తెలుస్తోంది. మరి కొత్తపల్లి సుబ్బారాయుడు ఏ పార్టీలో చేరతారు? టీడీపీలో చేరతారా? చేరినా టికెట్ సాధించుకోగలరా? అన్న చర్చ జరుగుతుంది. ఒకవేళ టికెట్ రాకపోతే జనసేనలో చేరతారా అనే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం కొత్తపల్లి సుబ్బారాయుడు పార్టీలో చేరికకు సంబంధించి వేచి చూసే ధోరణిలో ఉన్నారని మరికొన్ని రోజుల్లో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 

Tags:    

Similar News