Home Minister Anita:‘నిజాలు తెలుసుకొని మాట్లాడండి’.. హోంమంత్రి అనిత ఫైర్
ఏపీ శాసనమండలిలో గత ప్రభుత్వం పై హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ శాసనమండలిలో గత ప్రభుత్వం పై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో చిరుద్యోగుల స్థాయి నుంచి ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి వరకు జీతాలే సరిగా ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందని హోం మంత్రి అనిత మండిపడ్డారు. ఈ క్రమంలో టీఏ, డీఏ, సరెండర్ లీవ్‌లు, ఐఆర్, ఇంక్రిమెంట్లు, పీఆర్సీలు ఏవీ ఇవ్వక ప్రభుత్వ ఉద్యోగులు నరకయాతన అనుభవించారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల ప్రభుత్వ పాలన అల్లకల్లోలం గురించి వదిలేసి ఐదు నెలల ప్రభుత్వంపై విమర్శలా? అంటూ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో ఒకటో నెల వచ్చేసరికి జీతాలు పొందుతున్నందున ప్రభుత్వ ఉద్యోగులకు సంతోషిస్తున్నారని ఆమె అన్నారు. ఐదేళ్లు జీతాలు సక్రమంగా ఇవ్వలేకపోయిన వారు కొత్త ప్రభుత్వాన్ని పీఆర్సీల గురించి అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల పై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేశాం, స్త్రీనిధికి రూ.3,500 కేటాయించినా మహిళలకు రూపాయి కూడా కేటాయించలేదనడం సబబా? అంటూ ప్రశ్నించారు. సత్యాలు చెప్పి సభలో సద్విమర్శ చేస్తే ఆలోచించుకుని సరిచేసుకుంటాం.. కానీ లేనిపోని అభాండాలతో అబద్ధాలు చెబితే సభా హక్కుల ఉల్లంఘన కింద వస్తుందని తెలియపరుస్తున్నాం అన్నారు. బడ్జెట్ పుస్తకాలు సభ్యుల వద్ద ఉన్నాయి.. చదివి నిజాలు తెలుసుకుని మాట్లాడాలని కోరుతున్నాను అని హోం మంత్రి అనిత అన్నారు. ఉచిత సిలిండర్ల పథకానికి రూ.2500 కోట్లు.. అందులో భాగంగా మొదటి విడతగా బడ్జెట్లో రూ.800 కోట్లు కేటాయింపు ఒక్కొక్క సిలిండర్‌కి గడువు పెట్టి మార్గదర్శకాల ప్రకారం ఉచిత సిలిండర్లకు స్పష్టంగా గైడ్ లైన్స్ ఇచ్చాం అన్నారు. 150 రోజుల కూటమి ప్రభుత్వ పాలనను 7 నెలలని చెప్పడం తగునా? అమ్మఒడిని ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది తర్వాత వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది మరిచారా? అంటూ గత వైసీపీ ప్రభుత్వం పై హోం మంత్రి అనిత నిప్పులు చెరిగారు.