Viveka Case : కండీషన్స్ అప్లై : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్‌పై విడుదల

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Update: 2023-09-22 11:51 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో శుక్రవారం వైఎస్ భాస్కర్ రెడ్డి చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. వైఎస్ భాస్కర్ రెడ్డి జైలులో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణలో భాగంగా వైఎస్ భాస్కర్ రెడ్డి అనారోగ్యంపై సీబీఐ కోర్టు చంచల్ గూడ జైలు సూపరింటెండెంట్ వివరణ కోరింది. భాస్కర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నది వాస్తవమేనని తెలిపారు. ఈ మేరకు నివేదిక అందజేశారు. జైలు సూపరింటెండెంట్ నివేదికను పరిగణలోకి తీసుకున్న సీబీఐ జడ్జి ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేశారు. ఈ 12 రోజులు వైద్య చికిత్స చేయించుకోవాలని సీబీఐ కోర్టు ఆదేశించింది.

కండీషన్స్ అప్లై

ఎస్కార్ట్ బెయిల్‌పై విడుదలైన వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్టు పలు షరతులు విధించింది. బెయిల్ సమయంలో హైదరాబాద్‌ను విడిచి పెట్టి వెళ్లరాదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు హైదరాబాద్‌లోనే చికిత్స పొందాలని స్పష్టం చేసింది. అక్టోబర్ 3న చంచల్ గూడ జైలు సూపరింటెండెంట్ ముందు సరెండ్ అవ్వాలని వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ కోర్టు బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొంది. వైఎస్ భాస్కర్ రెడ్డి జైలు నుంచి శుక్రవారం విడుదలైన వెంటనే చికిత్స కోసం ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ విచారణకు ఏ-8 నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాశ్ రెడ్డితోపాటు మిగిలిన నిందితులు సైతం హాజరయ్యారు. తదుపరి విచారణను అక్టోబర్ 4కు సీబీఐ కోర్టు వాయిదా వేసింది. 

Tags:    

Similar News