స్కిల్ కేసు తీర్పుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. దీపావళి సెలవుల తర్వాత వెల్లడి
స్కిల్ స్కాం కేసులో సుప్రీంకోర్టు తీర్పు కోసం దేశవ్యాప్తంగా అంతా ఎదురుచూస్తున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కాం కేసులో సుప్రీంకోర్టు తీర్పు కోసం దేశవ్యాప్తంగా అంతా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఈ తీర్పుపై వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో తీర్పు కోసం దేశంలోని రాజకీయ నాయకులు ఎందుకు ఎదురుచూస్తున్నారు అంటే అందుకు కారణం లేకపోలేదు. చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో ప్రధాన అంశం 17ఏ నిబంధన. ఈ నిబంధన చంద్రబాబు నాయుడుకు వర్తిస్తుందని ఆయన తరఫు న్యాయవాదులు వర్తించదని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని ఆ నిబంధనలకు తూట్లు పొడిచి చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీపీతోపాటు చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు సైతం వాదిస్తున్నారు. ఈ టెక్నికల్ అంశాన్నే బేష్ చేసుకుని సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ స్కిల్ కేసుపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. అయితే తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. దీంతో సుప్రీంకోర్టు తీర్పుకోసం తెలుగు రాష్ట్ర ప్రజలతోపాటు దేశంలోని రాజకీయ నేతలు ఎదురుచూస్తున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పుపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్‌కోసం చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా దీపావళి సెలవుల అనంతరం స్కిల్ కేసులో తీర్పును వెల్లడిస్తామని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ప్రకటించింది.
17ఏ అత్యంత కీలకం
ఇకపోతే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధానంగా 17-ఏ వర్తింపుపై వాదనలు జరిగాయి. ఈ తీర్పుపై వాదనలు ముగిసినట్లు ఇప్పటికే సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది. శుక్రవారం ఈ కేసుకు సంబంధించి తీర్పు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. 17 ఏపై కేసులో తీర్పు పెండింగ్ నేపథ్యంలో పైబర్ నెట్ కేసును గతంలో ఈనెల 9కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెల్లడికాలేదు. అంతేకాదు కేసుల విచారణ జాబితాలోనూ అది లిస్ట్ కాలేదు. ఈ నేపథ్యంలో కేవలం ఫైబర్‌నెట్ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈనెల 3కు తదుపరి విచారణను వాయిదా వేసింది. అప్పటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయెుద్దని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.