హనీట్రాప్ కేసులో ముగిసిన జెమీమా కస్టడీ.. కీలక ఆధారాలు స్వాధీనం!
విశాఖ హనీ ట్రాప్ కేసులో నిందితురాలు మురళీనగర్ ఎన్జీవోస్ కాలనీకి చెందిన నిందితురాలు కొరుప్రోలు జాయ్ జెమీమా పోలీసు కస్టడీ ముగిసింది.
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ హనీ ట్రాప్ కేసులో నిందితురాలు మురళీనగర్ ఎన్జీవోస్ కాలనీకి చెందిన నిందితురాలు కొరుప్రోలు జాయ్ జెమీమా పోలీసు కస్టడీ ముగిసింది. హనీ ట్రాప్‌కు సంబంధించి భీమిలి పోలీస్ స్టేషన్‌లో సీఐ బి.సుధాకర్, కంచరపాలెం, దువ్వాడ సీఐలు చంద్రశేఖర్, మల్లేశ్వరరావులు ఆమెను పలు అంశాలపై విచారించారు. ఈ క్రమంలోనే జెమీమా నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్, ఫోన్లను ఓపెన్ చేయించి.. అందులో హనీట్రాప్ ముఠాకు సంబంధించిన మూలాలు, మిగిలిన బాధితులకు సంబంధించిన సమాచారం సేకరించేందుకు ప్రయత్నించారు.
ముఖ్యంగా ఈ ముఠా మధ్య జరిగిన నగదు లావాదేవీలపై, ముఠా సభ్యుల వివరాలపై పోలీసులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే జెమీమా మాత్రం తాను అమాయకురాలినని, తానే మోసపోయానని బాధపడుతూ పోలీసులు అడిగిన ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పలేదని పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా మత్తు పదార్థాల వినియోగం విషయంలో జెమీమా ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదని పోలీసులు చెబుతున్నారు. అయితే నిందితురాలి కస్టడీ ముగియడంతో కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయస్థానం ఆమెని తిరిగి సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశించింది. కాగా.. జెమీమాను మరోసారి కస్టడీలోకి తీసుకునే ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.