బీజేపీ మార్గదర్శకత్వంలో జనసేనాని..మారిన పవన్ కళ్యాణ్ వ్యూహం?
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. టీడీపీ రాజకీయాలు స్థిరంగా ఉన్నా,అధికార వైకాపా, జనసేన పార్టీల్లో రాజకీయ వేడి నానాటికి పెరుగుతుంది.
దిశ, ప్రతినిధి : ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. టీడీపీ రాజకీయాలు స్థిరంగా ఉన్నా,అధికార వైకాపా, జనసేన పార్టీల్లో రాజకీయ వేడి నానాటికి పెరుగుతుంది.టీడీపీతో జనసేన పొత్తు తొలి జాబితా విడుదలతో తొలి అంశం ముగిసింది.మలి అంకంలో ఈ రెండు పార్టీలతో బీజేపీ కలవటమే మిగిలింది.ఈ అంశంపై మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది.ఈ నేపథ్యంలో బీజేపీ ఆలోచనల మేరకు పవన్ వ్యూహాత్మకంగా ముందు కెళ్ళుతున్నట్లు తెలుస్తోంది. పవన్ పోటీ చేసిన నియోజకవర్గాలు ఇంకా ప్రకటించకపోవడం పై అసంతృప్తి వ్యక్తం అవుతున్న,బీజేపీ మార్గదర్శకంలో పవన్ ఎక్కడ పోటీ చేయబోతున్నారు? టీడీపీ,జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించారు. పొత్తులో భాగంగా జనసేనకు 24 ఎమ్మెల్యే, 3 ఎంపీ స్థానాలు ఖరారు చేశారు. పవన్ గత ఎన్నికల్లో పోటీ చేసిన భీమవరం,గాజువాక నియోజకవర్గంలో ఓడిపోయారు.ఈ సారి పవన్ భీమవరం నుంచి మరోసారి పోటీ చేస్తారనే ప్రచారం సాగింది.కానీ ఇప్పుడు పవన్ నిర్ణయం మారింది.
రెండు స్థానాలకు పోటీ చేయనున్నారు. అయితే అవి రెండు ఎమ్మెల్యే స్థానాలు కాదు.తొలుత పవన్ కల్యాణ్ ఈ సారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని డిసైడ్ అయ్యారు.టీడీపీతో పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ సీట్ల నుంచి తన పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపటానికి నిర్ణయించారు. అదే విధంగా మూడు ఎంపీ స్థానాలు ఖరారయ్యాయి. పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి,మెగా బ్రదర్ నాగబాబు అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారనుకున్నా,ఈ సారి ఎన్నికల బరిలో నాగబాబు ఉండటం లేదు.అయితే తన ఆలోచన,బీజేపీ పెద్దల సూచనల మేరకు పవన్ ఆలోచన మారినట్లు తెలుస్తోంది. భీమవరం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత పులివర్తి రామాంజనేయులు జనసేన నుంచి ఈ సారి బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు పవన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఇదే సమయంలో పవన్ కల్యాణ్ ఈ సారి గోదావరి జిల్లాలతో పాటు విశాఖ లో ఎక్కువ సీట్లు తీసుకుంటున్న నేపథ్యంలో భాగంగా ఎంపీ సీట్లు కాకినాడ, అనకాపల్లి, మచిలీపట్నం ఎంపిక తీసుకున్నట్లు సమాచారం. మచిలీపట్నంకు వైకాపా నుంచి వచ్చిన బాలసౌరి ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
కాకినాడ,అనకాపల్లి స్థానాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నా,పవన్ కళ్యాణ్ అనకాపల్లికే ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రణాళికలో భాగంగా అనకాపల్లి నుంచి నాగబాబు నిష్క్రమణ. రెండు చోట్ల పోటీ చేస్తారని వెలువడుతున్నా ఊహాగానాల మేరకు రెండు చోట్ల పోటీ చేస్తారు,కానీ అవి ఎమ్మెల్యే నియోజకవర్గాలు కాదని విశ్వసనీయ వర్గాల బోగట్టా. పవన్ ఎమ్మెల్యేగా పిఠాపురం,కాకినాడల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.గతంలో పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగింది. కానీ భీమవరం పర్యటన సమయంలో తాను పోటీ చేస్తున్నానని సహకరించాలని పవన్ కోరారు. ఇప్పుడు అభ్యర్థుల జాబితా మార్పు తరువాత వస్తున్న స్పందనలతో పవన్ అప్రమత్తం అయ్యారు. అదే సమయంలో బీజేపీ నేతల నుంచి పవన్ ఎంపీగా పోటీ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది.
పిఠాపురం అసెంబ్లీ తో పాటుగా అనకాపల్లి నుంచి పవన్ ఎంపీగా పోటీ చేస్తారని చెబుతున్నారు. కానీ గోదావరి జిల్లా నేతలు మాత్రం కాకినాడ నుంచి ఎంపీగా బరిలో దిగడం ద్వారా ఆ పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం రెండు రకాలుగా కలిసి వస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థి,ఉమ్మడి విశాఖలో ఎంపీగా పోటీ చేయడం ద్వారా రెండు జిల్లాల్లో ప్రభావం ఉంటుందనేది మరో విశ్లేషణ. తద్వారా రెండు జిల్లాలో మెజార్టీ సీట్లు సాధించవచ్చనే అంచనాలతో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే,ఎంపీగా పోటీ చేయడం పైన ఇప్పటికే చంద్రబాబుతోనూ పవన్ చర్చించినట్లు సమాచారం. రెండు జిల్లాలకు చెందిన నేతలతో చర్చించిన తరువాత పవన్ తన నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత తరుణంలో రాష్ట్ర కూటమి అధికారంలోకి వచ్చినా, పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా ప్రభావం చూపే అవకాశం ఉండదు.పొత్తులో భాగంగా ఒక డిప్యూటీ సీఎం పదవితో పాటు రెండు మంత్రి పదవులు పొందవచ్చేమో గాని పవన్ కళ్యాణ్ కంటూ ప్రత్యేక గుర్తింపు ఉండదు.ఈ నేపథ్యంలోనే ఎంపీగా గెలుపొంది కేంద్ర క్యాబినెట్ లో మంత్రి పదవి పొందడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో చక్రం తిప్పే అవకాశాలు ఉంటాయి.ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీని పటిష్టం పరచుకుని,వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ సహకారంతో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది.
Read More..