పెళ్లి పత్రికలో ‘జనసేన’ క్యూఆర్ కోడ్.. ఇలాంటి అభిమానం పవన్‌కే సొంతం
ఈ మధ్య వివాహ వేడుకల్లో నగదు చదివించడం కోసం పెళ్లి కార్డులోనే గూగుల్ పే, ఫోన్ పే సంబంధిత క్యూ ఆర్ కోడ్‌లు పెడుతున్న సంగతి తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: ఈ మధ్య వివాహ వేడుకల్లో నగదు చదివించడం కోసం పెళ్లి కార్డులోనే గూగుల్ పే, ఫోన్ పే సంబంధిత క్యూ ఆర్ కోడ్‌లు పెడుతున్న సంగతి తెలిసిందే. వధూవరులను ఆశీర్వదించి కుటుంబీకులు, స్నేహితులు ఇచ్చే నగదు డైరెక్ట్ వారి అకౌంట్‌లో జమ అవుతుంది. తాజాగా ఓ వ్యక్తి ఇందుకు భిన్నంగా ఇంకో అడుగు వేశాడు. పెళ్లి పత్రికల్లో జనసేన పార్టీ క్యూ ఆర్ కోడ్ పెట్టించి పార్టీపై అభిమానం చాటుకున్నాడు. తనకు కానుకగా ఇచ్చే నగదును పార్టీకి చేరేల తన అభిమానం వ్యక్తం చేశారు.
నాసేన కోసం నా వంతు..
‘నాసేన కోసం నా వంతు.. మన భవిత కోసం శ్రమించే మన జనసేనను ఆర్థికంగా బలోపేతం చేద్దాం’ అని క్యూర్ కోడ్ పై రాశారు. మన ఇంటి పెద్ద ఎంత బాధ్యతగా ఉండాలో.. మన రాష్ట్ర పెద్ద అంతే బాధ్యతగా ఉండాలి. ఓటు హక్కును వినియోగించుకో.. సరైన నాయకుడిని ఎన్నుకో అని పత్రికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటో, సింబల్ ముద్రించారు. ఏకంగా పెళ్లి పత్రికలో జనసేనకు వినూత్న ప్రచారం చేశాడు పెళ్లి కొడుకు.
హిట్టులో తోడున్నాం.. ఫ్లాపుల్లో తోడున్నాం
హిట్టులో తోడున్నాం.. ఫ్లాపుల్లో తోడున్నాం, ఓటమిలో తోడున్నాం, గెలిచే వరకు తోడుందాం అని పెళ్లి పత్రికల్లో పేర్కొన్నారు. ఈ పెళ్లి పత్రిక తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇలాంటి అభిమానం పవన్ కళ్యాణ్‌కే సొంతం అని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు వైసీపీ శ్రేణులు ఇక్కడ కూడా చందాలేనా? అంటూ విమర్శిస్తున్నాయి. కాగా, జనసేన పార్టీ విరాళాల కోసం గత ఏడాది క్యూ ఆర్ కోడ్ తీసుకువచ్చింది.