వైసీపీ నాయకులపై పవన్ ఫైర్.. వైసీపీ రౌడీలను వదిలిపెట్టనంటూ కామెంట్స్
రైతులు తెగువ చూపించి ఉంటే అమరావతి కదిలేది కాదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.
దిశ, వెబ్ డెస్క్: రైతులు తెగువ చూపించి ఉంటే అమరావతి కదిలేది కాదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఆదివారం ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత బాధితులకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు. ఒక్కొక్క కుటుంబానికి రూ. లక్ష చొప్పున పవన్ ఆర్ధిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్.. వైసీపీ నాయకులపై నిప్పులు చెరిగారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో రౌడీల పాలన నడుస్తోందని మండిపడ్డారు. వైసీపీ నేతలకు సంస్కారం, మంచి, మర్యాద పని చేయవని.. వాళ్లు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వీధి రౌడీలకు బుద్ధి చెప్పేందుకు జనసేన కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇప్పటం ఇళ్ల కూల్చివేత వెనుక సజ్జల పాత్ర ఉందని ఆరోపించారు. సజ్జల డీఫ్యాక్టో సీఎంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పటం ప్రజలపై సజ్జల కక్షసాధింపుకు దిగారని, ఈ క్రమంలోనే ఇళ్ల కూల్చివేత జరిగిందని అన్నారు.
వాళ్లకు పరిహారం ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటం ప్రజల ఇళ్ల కూల్చివేత తనను బాధించిందని, అందుకే వారికి అండగా ఉండేందుకు గ్రామానికి వచ్చానని స్పష్టం చేశారు. 2024 తర్వాత తాము అధికారంలోకి వస్తామన్న పవన్.. అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. చట్టపరంగానే వైసీపీ నాయకుల ఇళ్లు కూలగొడతామని చెప్పారు. తాను అన్నింటికి సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజా సేవలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని పవన్ తేల్చి చెప్పారు.
ఇవి కూడా చదవండి : అప్పటివరకు జనసేన నిద్రపోదు: పవన్ కళ్యాణ్