వ్యూహం మార్చిన పవన్.. టికెట్ కావాలంటే ఆ పని చేయాల్సిందేనని తేల్చిచెప్పిన జనసేనాని..!

జనసేన అధినేత గత ఎన్నికల సమయంలో అదేపనిగా ప్రవచించిన జీరో బడ్జెట్ రాజకీయాలకు ఆ పార్టీ స్వస్తి పలికేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కోట్లు ఖర్చు

Update: 2024-02-24 01:57 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: జనసేన అధినేత గత ఎన్నికల సమయంలో అదేపనిగా ప్రవచించిన జీరో బడ్జెట్ రాజకీయాలకు ఆ పార్టీ స్వస్తి పలికేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కోట్లు ఖర్చు చేయకపోతే జనం ఓట్లు వేయరని కఠోర వాస్తవాన్ని జనసేన ఎట్టకేలకు గుర్తించింది. పొత్తులో భాగంగా గణనీయమైన సీట్లతో గట్టిగా అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావిస్తున్న జనసేన ఇప్పడు వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఆర్థికంగా కాస్త పటిష్టంగా ఉన్న వారికే సీట్లు ఇచ్చేందుకు మొగ్గు చూపుతోంది. మొహమాటంతో ఉద్యమకారులకో, సామాజిక వేత్తలకో సీట్లు ఇచ్చి డబ్బు ఖర్చు చేయకపోతే ఉపయోగం ఉండదనే భావనకు ఆ పార్టీ వచ్చింది.

నగదు సిద్ధం చేసుకొని సీట్లు అడగండి

రానున్న అసెంబ్లీ ఎన్నికలలో సీట్లు ఆశిస్తున్న నేతలు అందుకు సరిపడా నగదు సిద్ధం చేసుకొని సీటు కోరాలనే మెసేజ్‌ను జనసేన అధిష్టానం ఇప్పటికే పంపించింది. ఇప్పుడు ఎవరైనా సీటు కావాలని అడుగుతుంటే నిర్మొహమాటంగా మీరు ఎంత ఖర్చు చేయగలుగుతారు..? అని అధిష్టానం ఎదురు ప్రశ్న వేస్తోంది. నియోజక వర్గాన్ని బట్టి ఖర్చు ఉంటుందని దానికి తగ్గట్టుగా అభ్యర్థులు సిద్ధం కావాలని స్ఫష్టం చేస్తోంది.

పార్టీ నుంచి ఇచ్చేదేమీ ఉండదు

జనసేన పార్టీ నుంచి ఒక్కపైసా కూడా అభ్యర్థులకు ఇచ్చే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలు చేసినప్పుడు బయట నుంచి చందాలు తీసుకోకుండా సంబంధిత జిల్లాల నేతలే ఆ ఖర్చు భరించారు. పార్టీలో నిధుల నిల్వ లేకపోవడం వల్లే ఇటీవల విశాఖ జిల్లా నేతలతో జరిగిన సమావేశం సందర్భంగా పవన్ తన వంతుగా పార్టీకి పది కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ నిధులను కేవలం పార్టీ నిర్వహణకే వినియోగిస్తారు.

నా సేన.. నా వంతు

‘నా సేన.. నా వంతు’ అనే నినాదంతో కార్యకర్తల నుంచి పార్టీ నిర్వహణ కోసం జనసేన చందాలు తీసుకొంటోంది. మిగిలిన పార్టీల మాదిరిగా రహస్యంగా గాక బహిరంగంగానే చందాలు వసూలు చేస్తుంది. ఆన్‌లైన్‌లో స్కాన్ కోడ్ ద్వారా పది రూపాయల నుంచి చందాలు ఇవ్వవచ్చు. కొన్ని జిల్లాలలో పార్టీ కార్యాలయాల అద్దెలను కూడా పార్టీనే చెల్లిస్తుంది.

చందాలిచ్చాం.. టికెట్ మాదే అన్నా కుదరదు

టికెట్ ఆశించి జనసేనలో చేరి స్వచ్ఛందంగా చందాలిచ్చి అధిష్టానం ప్రయేయం లేకుండా టికెట్ తమదే అని ప్రచారం చేసుకొనే వారి పట్ల కూడా పార్టీ కఠినంగానే ఉంది. అటువంటి వారిని ఇటీవల గుర్తించి వారిచ్చిన చందాలను వెనక్కి ఇచ్చేసింది. తమదే టికెట్ అంటూ మీడియాలో తప్పుడు ప్రచారం చేసుకొంటున్న వారిపైన ఓ కన్ను వేసి వారితోనే మీడియాలో ఖండనలు ఇప్పిస్తోంది.

Tags:    

Similar News