డీల్ రూ.5 కోట్లు.. అడ్వాన్స్ రూ.2 కోట్లు! లంచంగా చూపించింది రూ.25 లక్షలే

కాంట్రాక్టర్ నుంచి రూ.25 లక్షలు తీసుకుని సీబీఐకి రెడ్ హ్యాండెడ్‌‌గా దొరికిన విశాఖ రైల్వే డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్ కేసులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి.

Update: 2024-11-19 01:38 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: కాంట్రాక్టర్ నుంచి రూ.25 లక్షలు తీసుకుని సీబీఐకి రెడ్ హ్యాండెడ్‌‌గా దొరికిన విశాఖ రైల్వే డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్ కేసులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. గతేడాది జూలైలో విశాఖలో బాధ్యతలు స్వీకరించిన ఆయనకు ముంబైలో ఖరీదైన ఓ ఇల్లుంది. ఏడాదిపాటు పాత ఆర్ఎం అనూప్ కుమార్ శతపతి పాల్పడిన అవినీతిని, తీసుకున్న లంచాల వివరాలను క్షుణ్ణంగా సేకరించిన ప్రసాద్.. అదే బాటపట్టి చివరకు అడ్డంగా దొరికిపోయారు. అవినీతి వ్యవహారంలో రైల్వేలోనే పనిచేస్తున్న ఆయన రెండో భార్య కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. విశాఖలోని పారిశుధ్య పనుల (ప్లాట్ ఫారాలు, పరిసర ప్రాంతాల పరిశుభ్రత) మెకానికల్ అండ్ హెల్త్ విభాగ టెండర్లకు సంబంధించి ఇద్దరు వ్యక్తులు కాంట్రాక్ట్ పొందినట్టు తెలిసింది.

రూ.62 కోట్ల కాంట్రాక్టు కోసం లంచం..

మొత్తం రూ.62 కోట్ల విలువైన ఈ పనుల ప్రారంభానికి డీఆర్ఎం అనుమతులు మంజూరు చేయాల్సి ఉంది. జూలైలోనే పనులకు సంబంధించి అనుమతులు అధికారికంగా లభించినా డీఆర్ఎం నుంచి కూడా ఢిల్లీ వర్గాలకు కాగితం వెళ్లాల్సి ఉంది. తనకు 10 శాతం లంచం ఇవ్వాలని సౌరభ్ ప్రసాద్ డిమాండ్ చేయగా రూ.5 కోట్లు మాత్రమే ఇవ్వగలమని ఆ ఇద్దరు కాంట్రాక్టర్లు ఒప్పుకొన్నట్టు సమాచారం. అందులో భాగంగా నెలల తరబడి డాక్యుమెంట్స్ పెండింగ్‌లో ఉండడంతో కాంట్రాక్టర్లు ఒత్తిడి చేశారు. తాను పనిమీద ముంబయి వెళ్తున్నానని, డబ్బు అక్కడ ముట్టచెబితే ఈ సోమవారం (ఈ నెల 18న) సంతకాలు పెట్టేసి రైల్వే కేంద్ర కార్యాలయానికి పంపిస్తానని చెప్పారని తెలిసింది. ఇదే విషయాన్ని ముంబయిలో ఉంటున్న ఓ కాంట్రాక్టర్ సన్నిహితుడికి తెలియజేయడం, అక్కడి వారు నేరుగా సీబీఐలోని ఏసీబీ విభాగాన్ని ఆశ్రయించడం, అధికారులు డీఆర్ఎం సౌరబ్ ప్రసాద్ కారును వెంబడించి ఆయన ఇంట్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం గంటల వ్యవధిలోనే జరిగిపోయాయని తెలిసింది.

బయట పెట్టింది రూ.25 లక్షలే..

వాస్తవానికి సౌరభ్ ప్రసాద్ రూ.5 కోట్లు లంచం డిమాండ్ చేయగా కాంట్రాక్టర్లు రూ.2కోట్లు అడ్వాన్స్ ఇచ్చారని తెలుస్తోంది. అదే విషయాన్ని వారు సీబీఐకి కూడా సమాచారమిచ్చారు. ఈ వ్యవహారాన్ని అధికారులు నేరుగా ప్రధాని కార్యాలయానికి కూడా తెలియజేశారని, లంచం సొమ్ము కేవలం రూ.25 లక్షలే చూపించాలని సదరు బ్యూరోక్రాట్స్ నుంచి సూచనలు రావడంతో సీబీఐ అధికారులు ఆ మేరకే సౌరభ్ ప్రసాద్ పై కేసు నమోదు చేసినట్టు తెల్సింది. కోట్ల మొత్తాల్లో రైల్వే పసుల్లో లంచాలుంటాయని పౌర సమాజానికి తెలిస్తే ఆ వ్యవస్థపై ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందనే భావనతోనే పీఎంవో అధికారులు రూ.2 కోట్లకు బదులుగా రూ.25 లక్షలుగానే లెక్కలు చూపించమన్నట్టు సమాచారం.

విలువైన పత్రాలు స్వాధీనం..

సౌరబ్ ప్రసాద్ ఇంట్లో రూ.87లక్షల నగదు, రూ.72లక్షల విలువైన బంగారంతో పాటు డీఆర్ఎం ఇల్లు, విశాఖ కార్యాలయంలో విలువైన పత్రాల్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ అధికారులు అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి సౌరబ్ ప్రసాద్ 4 రోజుల సెలవు అనంతరం సోమవారమే విధుల్లో తిరిగి చేరాల్సి ఉండగా ఈ వ్యవహారమంతా నడిచింది. ఢిల్లీ, ముంబయి ప్రాంతాల సీబీఐ అధికారులు పలుచోట్ల దాడులు చేయగా విశాఖ శాఖ అధికారులు సహాయం అందించినట్టు తెల్సింది.

అంతా ఆవిడే చేసింది..

బిహార్ ప్రాంతానికి చెందిన సౌరభ్ వ్యక్తిగతంగా మంచివాడే అని సహచరులు చెబుతున్నారు. సాయం చేసే గుణమున్న వ్యక్తే అని అంటున్నారు. ఆయన తాళి కట్టిన భార్య ఐదేళ్ల క్రితం వ్యక్తిగత తగాదాల నేపథ్యంలో వేరయినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ట్రైన్ ఆపరేషన్స్ అండ్ మెయింట్ నెన్స్ విభాగంలో సౌరభ్ ప్రసాద్ పనిచేస్తున్న సమయంలో ఒక మహిళా ఉద్యోగి అక్రమాలకు పాల్పడడంతో ఆమెను అప్పట్లో ఆయనే సీబీఐకి పట్టించారు. దీంతో తొలుత ఆమె ప్రసాద్ పై కక్ష కట్టినా తదనంతర కాలంలో ఆమె కూడా సౌరబ్ తో సాన్నిహిత్యం మొదలెట్టారని, ఆ తరవాత ఆమెనే సౌరబ్ రెండో పెళ్లి చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. లంచం కేసులో సౌరబ్ ప్రసాద్ సీబీఐకి చిక్కడం వెనుక కూడా ఆమె పాత్ర కనిపిస్తోందని, లంచం ఎంతిస్తే అంత కాంట్రక్టర్ల వద్ద తీసుకోవడానికి సౌరబ్ సిద్ధపడినా ఆమె మాత్రం ససేమిరా రూ.5 కోట్లకు తక్కువ వద్దని కరాఖండిగా చెప్పిందని, అందువల్లే బాధితులు సీబీఐని ఆశ్రయించారని చెబుతున్నారు.

పాత డీఆర్ఎం శతపతి బాటలోనే..

ఇంతకుముందు విశాఖ రైల్వే డీఆర్ఎం‌గా పనిచేసిన అనూప్ కుమార్ శతపతి పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులు రైల్వే బోర్డులో ఉన్నాయి. రైల్ క్యాంటీన్ కేటాయింపు, రైల్వే కళ్యాణ మండపం, గ్రౌండ్‌ల లీజుల విషయంలో కోట్లలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాక ప్రతి పనికి లంచాలు వసూలు చేశారని ముద్రపడ్డారు. వీటన్నింటిపై వివరాలు సేకరించిన ప్రసాద్ సంవత్సరం తర్వాత అవినీతి గేట్లు తెరిచి అడ్డంగా దొరికిపోయారు.


Similar News