TDP: జగన్ బ్రతుకే ఒక ఫేక్.. హోంమంత్రి వంగలపూడి అనిత ఫైర్
జగన్ బ్రతుకే ఒక ఫేక్ అని, 11 సీట్లు రావడంతో మతి పోయి మాట్లాడుతున్నారని, చంద్రబాబుపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: జగన్ బ్రతుకే ఒక ఫేక్ అని, 11 సీట్లు రావడంతో మతి పోయి మాట్లాడుతున్నారని, చంద్రబాబుపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె.. వరద సాయంపై చేస్తున్న ఫేక్ ప్రచారంపై స్పందించారు. ఈ సందర్భంగా వైసీపీ నేత జగన్ పై విమర్శల వర్షం కురిపించారు. విజయవాడలో వరదలు వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు పదిరోజుల పాటు సహాయక చర్యల్లో పాల్గొన్నారని, ముంపు బాధితులకు వరద సాయంపై ముందున్న జీవోను సవరించి సాయం ప్రకటించారని తెలిపారు. ఒక పక్క సహాయక చర్యల్లో పాల్గొంటూనే.. మరోపక్క మంత్రులు, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి మరింత ముప్పు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారని తెలిపారు. దీంతో ఆయనకు ఎక్కడ మంచి పేరు వచ్చిందోనని జీర్ణించుకోలేక, దాన్ని చెడగొట్టాలనే ఉద్దేశంతో మందలాగా బయటకి వచ్చి, వారి చేతులో ఒక పేపర్ పెట్టుకొని నోటికొచ్చినట్టు రాయిస్తున్నారని మండిపడ్డారు.
జగన్ పాలనలో అవినీతితో ఖజానా ఖాళీ చేసి, చంద్రబాబు మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖర్చు పెట్టిందే ఆరు వందల కోట్లు అయితే అందులో ఐదు వందల కోట్లు అవినీతి చేశారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వానివి జగన్ ఎగ్ పఫ్ ల లెక్కల్లా ఉండవని, కావాలంటే ఆర్టీఐ యాక్ట్ ద్వారా తెలసుకోవాలని సూచించారు. మీరు చేసినట్టు మేం చేసుంటే మమ్మల్సి ప్రజలు వీధుల్లో కూడా తిరగనిచ్చే వారు కాదని చెప్పారు. వరదల్లో చాలామంది ఆధార్ కార్డులు, ఐడెంటిటీ కార్డులు పోయాయని వారిని కూడా గుర్తించి ప్రతీ ఒక్కరినీ ఆదుకుంటున్నామని, వరద సాయంపై మాట్లాడటానికి బుర్ర ఉండాలని అన్నారు. వరద సమయంలో చంద్రబాబు 12 రోజులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటే.. జగన్ 20 నిమిషాలు కూడా తిరగలేదని, అదికూడా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అందరూ ముందుకు తోస్తే దిగాడని ఎద్దేవా చేశారు. చనిపోయిన వారికి మొన్నటివరకు 4 లక్షలు ఇస్తే.. ఈ రోజు ఐదు లక్షలు చేసుకున్నామని, ముంపు పంటలకు 15 వేలు ఇచ్చేవారని. దాన్ని 25 వేలకు పెంచుకున్నామని తెలిపారు.
అన్నీ జీవోల ప్రకారమే ఇచ్చామని, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని అసెంబ్లీలో అరిచి మాట్లాతాడని, చదువు వస్తే చదువుకోవాలని అన్నారు. జగన్ వి అన్నీ ఫేక్ బుద్దులు, ఫేక్ రాతలు అని, ఆయన బతుకే ఒక ఫేక్ అని ఫైర్ అయ్యారు. జగన్ కు 11 సీట్లు రావడంతో మతి పోయిందని, నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. వరద సాయం విరాళాలు ఎవరు కూడా డబ్బు మూటలు తెచ్చి ఇవ్వట్లేదని, చెక్కులు తీసుకొస్తున్నారని దాని గురించి మాట్లాడటానికి సిగ్గుండాలని అన్నారు. ఆయన వరద సాయం కోటి రూపాయలు ప్రకటించాడు కానీ మాకు ఒక్క రూపాయి కూడా అందలేదని, హుద్ హుద్ సమయంలో ప్రకటించిన కోటి రూపాలకే దిక్కు లేదని, ఇప్పటికైనా ఇస్తారేమో చూడాలని అన్నారు. తప్పుడు రాతలతో పది సంవత్సరాల నుంచి బతికేస్తున్నారని, ఫేక్ రాతల వల్లే 11 సీట్లు వచ్చాయని, ఇలాగే కొనసాగితే సున్నా వస్తాయని వ్యాఖ్యానించారు. ఇక వరదల విషయంలో, సహాయ సహాకారాలకు సంబంధించిన ఖర్చుల విషయంలో చర్చించడానికి ఎప్పుడైనా సిద్దంగా ఉన్నామని, ఆరోపణలు చేసిన వాళ్లు చర్చకు వస్తారా? అని సవాల్ విసిరారు.