Pawan kalyan:జగన్ ఫోకస్.. పవన్ పైనే! జనసేనే టార్గెట్?
ఎవరి ఆశలు వాళ్లవి. ఎవరి అంచనాలు వారివి.
ఎవరి ఆశలు వాళ్లవి. ఎవరి అంచనాలు వారివి. వైసీపీ వ్యూహాత్మకంగా జనసేన పార్టీని ప్రధాన శత్రువుగా టార్గెట్ చేస్తోంది. తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటులో సింహభాగం జనసేన–బీజేపీ కూటమికి చేరాలనేది లక్ష్యం. దీంతోపాటే జనసేన నుంచి సీఎం పదవి ఇస్తేనే టీడీపీతో పొత్తనే ప్రచారం ఊపందుకుంది. ఎక్కడైనా రెండు ప్రధాన పక్షాలు ఢీ కొంటున్నప్పుడు ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక ఓట్లు ఆ రెండు పక్షాల మధ్యనే ఉంటాయి. మూడో పక్షానికి చేరడం కష్టం. దీనికి భిన్నంగా వైసీపీ ఎత్తుగడలున్నాయి. జనసేన నుంచి ముఖ్యమంత్రి పీఠం డిమాండ్టీడీపీతో పొత్తుకు గండి కొట్టడానికే తోడ్పడుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల నాటికి జనసేన బలం టీడీపీని అధిగమించే స్థాయికి చేరుతుందా? లేకుంటే పొత్తుతో అధికారంలో భాగస్వామ్యం పొందే అవకాశాన్ని చేజార్చుకుంటుందా? అనే దానిపై సర్వత్రా చర్చనీయాంశమైంది.
దిశ, ఏపీ బ్యూరో: ఇటీవల సామాజిక మాధ్యమాల్లో జనసేనాని వాహనం రంగుపై వైసీపీ పెద్దఎత్తున ట్రోలింగ్చేసింది. పత్రికల్లో ప్రధాన శీర్షిక ఆయన వాహనం రంగు గురించే. ఓ వైపు వైసీపీ చేపడుతున్న గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి పోటీగా టీడీపీ 'ఇదేం ఖర్మ రాష్ట్రానికి'అనే సర్వేను చేపట్టింది. ప్రతి కుటుంబం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గురించి ఈ సర్వే కొనసాగుతోంది. ప్రజలు తమ ఇబ్బందుల గురించి తెలియజేస్తున్నారు. దీని గురించి మీడియాలో పెద్దగా ఫోకస్కావడం లేదు. దీని స్థానంలో పవన్ వాహన రంగుపై చర్చ పెట్టడంలో వైసీపీ సఫలమైంది. ఎక్కడో ఒకటీ అరా చోట మాత్రమే టీడీపీ సర్వే గురించి కనిపించింది.
ప్రకటనలకే పరిమితం
పల్నాడు జిల్లాలో జనసేనాని పవన్ కల్యాణ్కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి క్లారిటీ లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనన్న దానికే కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. మరోవైపు టీడీపీ, బీజేపీకి జనసేన అమ్ముడు బోయినట్లు వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. అంటే ఒంటరిగా పోటీ చేస్తారా? లేక బీజేపీతో కలిసి పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటుందా? అని రాజకీయ వర్గాలు జుట్టు పీక్కుంటున్నాయి. ఈ మధ్య మరో వింత ప్రచారం జరుగుతోంది. టీడీపీ – జనసేన మధ్య స్నేహపూర్వక పోటీ ఉంటుందనేది దాని సారాంశం. ఎన్నికల్లో అలాంటి పోటీ ఇంతవరకు ఎక్కడా జరగలేదు. అలాంటి పోటీ జరిగితే ఓట్లు చీలకుండా ఎలా ఉంటాయో అర్థం కావడం లేదు.
ఆ డిమాండ్‌తో లాభమా.. నష్టమా!
జనసేన–టీడీపీ పొత్తు ఖరారు కావాలంటే పవన్‌కు సీఎం పదవి ఇస్తేనే అంగీకరిస్తామంటూ జన సైనికుల నుంచి వినిపిస్తోంది. దీనిపై పవన్ ఎక్కడా ఖండించలేదు. అలాగని తాను ఎక్కడా ప్రస్తావించలేదు. వాస్తవానికి పొత్తుతో ఎన్నికలకు వెళ్లాక ఆయా పార్టీల్లో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయి.. వైసీపీకి వచ్చిన సీట్లను బట్టి పవన్ బలం కీలకంగా మారితే సీఎం పదవి డిమాండ్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ రెండు పార్టీల బలాబలాలను బట్టి ముందస్తు ఒప్పందంతో పొత్తు పొసిగే అవకాశం లేదు. జనసేన నుంచి ఈ డిమాండ్తెరపైకి రావడం బీజేపీ–వైసీపీ వ్యూహంలో భాగమై ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
వైసీపీ ఆశలు ఫలించేనా!
జనసేన పార్టీని ప్రధాన శత్రువుగా టార్గెట్ చేయడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీ వైపు మరలకుండా చేయాలనేది వైసీపీ లక్ష్యం. దానికి అనుగుణంగానే ఆ పార్టీ నేతలు పవన్‌ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా ఎంత కష్టపడ్డా క్షేత్ర స్థాయి భౌతిక పరిస్థితులను మార్చలేవు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా పెత్తనం చేసే కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకే అన్ని కులాలపై పట్టుంది. కాపులు పరిమితంగా పెత్తనం చేయగలిగేది గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే. అందువల్ల ఓటరును ఎవరు ఎక్కువగా ప్రభావితం చేస్తారనే వాస్తవాలను బట్టే బలాబలాలుంటాయి. వైసీపీ, టీడీపీ అధికారం కోసం బలంగా పోటీపడుతున్నప్పుడు మూడో పక్షానికి ప్రజలు మద్దతునివ్వడం కష్టమని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దీంతో వైసీపీ పవన్‌కల్యాణ్‌ను ఎంత టార్గెట్చేసినా ఆశించిన ఫలితం రాకపోవచ్చని చెబుతున్నారు. ఎన్నికలు సమీపించే కొద్దీ మూడు ప్రధాన పక్షాల ఎత్తుగడల్లో మార్పులు ఉండొచ్చని భావిస్తున్నారు.
Read more:
నేను రాజకీయాల్లోకి రావడం కన్ఫామ్.. కానీ కుప్పం నుంచి కాదు: ప్రకటించిన స్టార్ హీరో