చంద్రబాబుపై మరికొన్ని కేసులను సిద్దం చేస్తున్న జగన్ సర్కారు

స్కిల్​ డెవలప్​మెంటు కేసుతోపాటు చంద్రబాబుపై మరో ఆరేడు ప్రాసిక్యూషన్లు ఉన్నాయని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

Update: 2023-09-13 02:11 GMT

దిశ, ఏపీ బ్యూరో: స్కిల్​ డెవలప్​మెంటు కేసుతోపాటు చంద్రబాబుపై మరో ఆరేడు ప్రాసిక్యూషన్లు ఉన్నాయని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. సీఐడీ ఇప్పటికే అమరావతి రింగు రోడ్డు, పుంగనూరు గొడవలపై ఎఫ్​ఐఆర్​లు సిద్దం చేస్తోంది. ఒక కేసులో బెయిలొచ్చినా మిగతా కేసులతో చంద్రబాబు, మరికొందరు కీలక నేతలను ఎన్నికలదాకా జైల్లో ఉంచాలని అధికార పార్టీ ఎత్తుగడలు వేస్తోంది. ఇక నుంచి ఎలా ముందుకు పోవాలనే అంశంపై సీఎం జగన్​ పార్టీ నేతలు, ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. వైసీపీ వ్యూహాన్ని చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారనేది అటు పార్టీ శ్రేణులతోపాటు ఇటు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

బాలయ్యకు సారథ్యం అప్పగిస్తే..

నటుడు నందమూరి బాలకృష్ణ పార్టీకి సారథ్యం వహించగలరా.. ఏమేరకు మైలేజీ వస్తుందనే అంశంపై పార్టీ సీనియర్లు తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్​ స్థాపించిన తెలుగు దేశం పార్టీ ఇప్పుడు పుట్టెడు కష్టాల్లో ఉంది. ఈ సమయంలో కుటుంబమంతా ఏకమవుతుందా కాదా అనే ప్రశ్న పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. జూనియర్​ ఎన్టీఆర్​ దూరంగా ఉన్నారు. దగ్గుబాటి పురందేశ్వరి టీడీపీని దెబ్బ కొట్టాలనుకునే బీజేపీ బాధ్యతల్లో ఉన్నారు. బీజేపీలో ఆమె తప్ప మరెవ్వరూ చంద్రబాబు అరెస్టును ఖండించలేదు. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్​ ఆశయాల సాధన కోసం జూనియర్ ఎన్టీఆర్​, పురందేశ్వరి చంద్రబాబుకు అండగా నిలుస్తారా లేదా అని తెలుగు తమ్ముళ్లలో జోరుగా చర్చలు సాగుతున్నాయి.

మరికొందరిని జైల్లో పెడితే..

మరికొందరు టీడీపీ కీలక నేతల్ని వైసీపీ సర్కారు టార్గెట్​ చేసి జైల్లో పెడితే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే ఆందోళన పార్టీ క్యాడర్​లో నెలకొంది. ఎవరెవరిని కేసులలో ఇరికించి జైలుపాలు చేస్తారనే అంశంపై చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. కలిసొచ్చే పార్టీలతో ఉమ్మడి అవగాహనతో పనిచేయాలని పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు.

బాబు వ్యూహం ఏమిటో..

బీజేపీతో పొత్తులో ఉన్న జనసేనాని పవన్​ కల్యాణ్..​ టీడీపీ అధినేతకు మద్దతుగా నిలిచారు. అండగా ఉంటామని సీపీఐ భరోసా ఇస్తోంది. చంద్రబాబు అరెస్టును ఖండించినా సీపీఎం తన వైఖరిని వెల్లడించలేదు. వామపక్షాలు ఓ వైపు ఇండియా కూటమిలో ఉన్నాయి. అందువల్ల కాంగ్రెస్​తో కలిసి పనిచేయాల్సి వస్తుంది. ఇన్ని చిక్కుముడుల మధ్య చంద్రబాబు ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. అటు ఎన్డీయేలో భాగస్వామి కాక.. ఇటు ఇండియా కూటమికి దూరంగా ఉన్నందునే ఈ దుస్థితి దాపురించినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో చంద్రబాబు ఎలా ముందుకెళ్తారనేది సర్వత్రా చర్చనీయాంశమైంది.

More News : Chandrababu Naidu : హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా 

Tags:    

Similar News