సొంత బాబాయ్‌కే చెమటలు.. అయినా తగ్గేదేలేదా..?
వైసీపీలో ఇంచార్జుల మార్పు ఎఫెక్ట్ ఆ పార్టీ నాయకులపైనా పడుతోంది. ..
దిశ, వెబ్ డెస్క్: వైసీపీలో ఇంచార్జుల మార్పు ఎఫెక్ట్ ఆ పార్టీ నాయకులపైనా పడుతోంది. ఎక్కడ సమావేశాలు పెట్టినా అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. తమకే సీట్లు కేటాయించాలంటూ నాయకులను, సమావేశాలను స్థానిక నేతలు, కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. దాంతో చేసేందేమీ లేక పార్టీ కో ఆర్డినేటర్లుగా వెళ్లిన నాయకులు సమావేశాల మధ్యలోనే వెళ్లిపోతున్నారు. అటు అంసతృప్తులను బుజ్జగించలేక, ఇటు అధిష్టానంతో మాట్లాడలేక తలలు పట్టుకుంటున్నారు.
రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. మరో నెలో, రెండో నెలల్లోనో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి అలర్ట్ అయ్యారు. అభ్యర్థల ఎంపికపై ఫోకస్ పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా సర్వేలు చేయించారు. ఈ సర్వేల్లో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి బాగోలేదని తేలింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఎలాగైనా సరే గెలిచేందుకు వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత అభ్యర్థులు మార్చాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఆయా నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జులను సైతం నియమించాలని అనుకున్నారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను సైతం మరో చోటకి స్థానభ్రంశం కలిగిస్తున్నారు. మరికొందరికి అసలు సీటే ఇవ్వడం లేదనే సంకేతాలు పంపారు. దీంతో ఆయా ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు సీటు ఇవ్వకపోతే పార్టీ నుంచి వెళ్లిపోతామని బహిరంగంగా హెచ్చరించారు. ఒకరిద్దరు నేతలు వైసీపీకి గుడ్ బై కూడా చెప్పేశారు. కొందరైతే మనసులో బాధ ఉన్నా సీఎం జగన్ వెంటే ఉంటామని అయిష్టంగా చెబుతున్నారు. ఇంకొదరైతే జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.
అయితే అసంతృప్తులు మాత్రం ఆగడం లేదు. వైసీపీ సమావేశాలు, సభల్లోనూ ఆవేదన వెళ్లగగ్గుతున్నారు. తమకే సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ అసంతృప్తి సెగ పార్టీ సీనియర్ నేత, సీఎం జగన్ బంధువు వైసీపీ సుబ్బారెడ్డికి గట్టిగా తగిలింది. విశాఖ జిల్లా గాజువాకలో ఆయన పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే నాగిరెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. గాజువాక సీటు తమకు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. పెద్దగా పెద్దగా అరుపులు, కేకలు వేస్తూ సమావేశాన్ని అడ్డుకున్నారు. జై జగన్, జై టిఎన్ఆర్ అంటూ సుబ్బారెడ్డి ఎదుటే పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఆయన సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆగలేదు. మరింతగా కేకలు వేయడంతో సుబ్బారెడ్డి కొంత అసహనానికి గురయ్యారు. అయినా నాగిరెడ్డి అనుచరులు సమావేశంలో అరుపులు, కేకలతో నినాదాలు చేశారు. దీంతో సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
దీనంతటి సీఎం జగన్ తీసుకున్న ఇంచార్జు మార్పు నిర్ణయమే కారణమని పలువురు నేతలు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. స్థానిక నాయకులకే సీట్లు కేటాయించాలని అంటున్నారు. మరి సీఎం జగన్ ఈ అసంతృప్తుల పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.