పాలకుడికి ఎలాగూ తెలుగు అంటే ఆసక్తి లేదు..మనమే మన భాషను కాపాడుకోవాలి : Pawan Kalyan
తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ తెలుగువాడికి ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ తెలుగువాడికి ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మాతృభాషను దూరం చేసేవిధంగా ఉన్న పాలకులు వ్యవహరిస్తున్నారని ఫలితంగా జరిగే అనర్థాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేసిన వ్యక్తి గిడుగు రామ్మూర్తి అని పవన్ కల్యాణ్ కొనియాడారు. మాట్లాడే భాష, రాసే భాష ఒకటి కావాలని పరితపించిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ఇందులో భాగంగానే వ్యవహారిక భాషోద్యమాన్ని నడిపిన గొప్ప వ్యక్తి గిడుగు రామ్మూర్తి అని పవన్ కల్యాణ్ తెలియజేశారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు రామ్మూర్తికి అంజలి ఘటిస్తున్నట్లు ప్రకటనలో వెల్లడించారు. తెలుగుజాతి ఎన్నడూ గిడుగు రామ్మూర్తి సేవలను మరువకూడదని పవన్ కల్యాణ్ సూచించారు.
ప్రకటనల్లో అక్షరదోషాలు
‘ఆంధ్రప్రదేశ్ పాలకుడికి ఎలాగూ తెలుగు అంటే ఆసక్తి లేదు. కాబట్టి ప్రజలే తెలుగు భాషను కాపాడుకునే బాధ్యతను స్వీకరించాలి’ అని జనసేనాని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ‘తెలుగు భాష అభివృద్ధి కోసం ఏర్పాటైన ప్రభుత్వ విభాగాల పనితీరును గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. వారు విడుదల చేసే ప్రకటనల్లోనూ, విద్యాశాఖ నుంచి వచ్చే ప్రకటనల్లో ఎన్ని అక్షర దోషాలు ఉంటున్నాయో చూస్తేనే తెలుస్తుంది. అలాంటి వారి నుంచి భాషా వికాసాన్ని ఆశించలేం. వ్యావహారిక భాషోద్యమానికి మూల పురుషుడైన గిడుగు వెంకటరామమూర్తి గారి స్ఫూర్తిని తెలుగు భాషాభిమానులు, అధ్యాపకులు, సాహితీవేత్తలు అందిపుచ్చుకోవాలి. చిన్నారులు ఓనమాలు నేర్చుకునే దశ నుంచే మన మాతృభాషను దూరం చేసే విధంగా ఉన్న పాలకుల తీరు వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. వ్యవహారిక భాషోద్యమానికి మూల పురుషుడైన గిడుగు రామ్మూర్తి స్ఫూర్తిని తెలుగు భాషాభిమానులు, అధ్యాపకులు, సాహితీవేత్తలు అందిపుచ్చుకోవాలి’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు.