AP News:స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అక్రమాలపై దర్యాప్తు

వైసీపీ పాలనలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌లో జరిగిన 570 కోట్ల రూపాయల భారీ కుంభకోణంపై దర్యాప్తు ప్రారంభమైంది.

Update: 2024-10-23 02:59 GMT

దిశ ప్రతినిధి,గుంటూరు: వైసీపీ పాలనలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌లో జరిగిన 570 కోట్ల రూపాయల భారీ కుంభకోణంపై దర్యాప్తు ప్రారంభమైంది. శాసనమండలి మాజీ సభ్యుడు ఏఎస్ రామకృష్ణ, గుంటూరు మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు ఇటీవల ఆధారాలతో సహా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపించాల్సిందిగా విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్‌మెంట్ డీజీని ఆదేశించారు. డీజీ హరీష్ కుమార్ గుప్తా వెంటనే స్పందించి రాజమండ్రి విజిలెన్స్ ఎస్పీ స్నేహిత, గుంటూరు ఎస్పీ శ్రవణ్ కుమార్‌ను విచారణ అధికారులుగా నియమించారు. మరోవైపు దర్యాప్తు కొరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్‌కు శాఖాపరమైన ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ డైరెక్టర్ హరినారాయణ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులతో త్రిసభ్య కమిటీని నియమించారు. పై అక్రమాల పై సోమవారం విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది. ఈ మేరకు గుంటూరు విజిలెన్స్ కార్యాలయంలో ఏఎస్ రామకృష్ణ, మన్నవ సుబ్బారావు అధికారులతో సమావేశమయ్యారు.

ఫోర్జరీ డాక్యుమెంట్లతో టెండర్లు..

కార్పొరేషన్ లోని ఉన్నతాధికారుల అండదండలతో ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి రూ.570 కోట్ల విలువైన టెండర్లు అక్రమంగా పొందినట్లు ఫిర్యాదులు వచ్చాయి. టెండర్ల నిబంధనలో ఎలాంటి పారదర్శకత లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. జ్ఞానేశ్వర, క్రీతి ఇంజనీరింగ్ అనే రెండు బోగస్ సంస్థలను ఏర్పాటు చేశారని, ఈ రెండు సంస్థలకు యజమాని ఒక్కరే అని, కెనరా, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకుల పేరుతో ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించారన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ పూజారి ఆనందరావు, ఐఏఎస్ అధికారిణి వై శ్రీలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కాంట్రాక్టర్ బినామీగా ఉన్నారని ఆరోపించారు. ఆడిట్ రిపోర్ట్, క్వాలిటీ కంట్రోల్ విభాగం బిల్లులు చేయొద్దు, ఇందులో అనేకమైన అక్రమాలు జరిగాయని స్పష్టం చేసినప్పటికి వాటిని పట్టించుకోకుండా అక్కడ ఉన్న డీఈ కృష్ణారెడ్డి, మంగళగిరి మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ సహకారంతో నిధులు డ్రా చేశారని ఫిర్యాదులో వివరించారు.. రివర్స్ టెండరింగ్ పేరుతో జాన్ సైదాకు టెండర్లు దక్కేలా ఉన్నతాధికారులు సహకరించారని, దీంతో 200 కోట్ల రూపాయలు డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. ఈఎండీలు కట్టకుండా పీఎస్ డీ, ఎఫ్‌ఎస్‌‌డీలు లేకుండా ఒప్పందాలు జరిగిపోయాయని, ఇందుకు కావాల్సిన అన్ని ఆధారాలను విజిలెన్స్ అధికారులకు వారు అందజేశారు.


Similar News