వైసీపీపై.. కసి ! మూడు స్థానాలను క్లీన్ స్వీప్ చేసిన టీడీపీ
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం టీడీపీలో ఉత్సాహాన్ని నింపుతోంది..
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇలా ఉంటాయని బహుశా తెలుగు దేశం పార్టీ కూడా ఊహించి ఉండదు. టీడీపీ ఇంతటి ఘన విజయం సాధించడానికి కారణమేంటి? జగన్ సర్కారుపై పట్టభద్రుల్లో పెల్లుబికిన అసహనమేనా ! ప్రభుత్వంపై ఆవేశంతో కసిగా టీడీపీకి ఓటేసినట్లు కనిపిస్తోంది. చివర్లో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కూడా దోహదపడినట్లుంది. రెండో ప్రాధాన్యం ఓట్లను పీడీఎఫ్‌తో సర్దుబాటు చేసుకోవడం కూడా టీడీపీని విజయతీరాలకు చేర్చినట్లు కనిపిస్తోంది. పశ్చిమ రాయలసీమ నియోజకవర్గంలో నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో అంతిమంగా టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. గ్రాడ్యుయేట్ఎమ్మెల్సీ ఎన్నికలను స్వీప్చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా తమ్ముళ్లు పండగ చేసుకుంటున్నారు. ఇప్పటిదాకా మొహం చాటేస్తూ వచ్చిన నాయకుల్లో కూడా జోష్వ్యక్తమవుతోంది.
దిశ, ఏపీ బ్యూరో: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం టీడీపీలో ఉత్సాహాన్ని నింపుతోంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఎక్కడకు వెళ్లినా “తమ్ముళ్లూ ! వైసీపీ సర్కారుపై ప్రజలు తిరగబడడానికి సిద్దంగా ఉన్నారు. మీరు గడపదాటి జనంలో ఉండండి. మిమ్మల్ని వాళ్లే ముందుకు నడిపిస్తారు!” అంటూ గుక్క తిప్పుకోకుండా చెబుతున్నారు. ఆయన అంచనా కరెక్టేనని గ్రాడ్యుయేట్ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ఉద్యోగులతోపాటు అసంఘటిత రంగంలో చాలీచాలని వేతనాలతో బతుకులు వెళ్లదీస్తున్న బడుగు జీవులంతా కట్టకట్టుకొని ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగరేసినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందనే ఆలోచనతో చంద్రబాబు తీసుకున్న ఓ నిర్ణయం కూడా ఫలించినట్లు తెలుస్తోంది. రెండో ప్రాధాన్యం ఓటు విషయంలో పీడీఎఫ్‌తో సర్దుబాటు చేసుకోవడం టీడీపీ అభ్యర్థులకు కలిసొచ్చినట్లు ఉంది. పార్టీ ముగ్గురు అభ్యర్థులు కూడా ద్వితీయ ప్రాధాన్య ఓటుతోనే గెలుపొందారు. చంద్రబాబు చాణక్యం ఫలించిందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.
వైసీపీని నమ్మని ఉత్తరాంధ్ర వాసులు..
ఉత్తరాంధ్రలో విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణపై వైసీపీ దాగుడు మూతలను పట్టభద్రులు నమ్మలేదు. రైల్వే జోన్, ఇతర విభజన హామీల సాధన విషయంలో వైసీపీ, బీజేపీ మిలాఖత్వ్యవహారాన్ని గ్రాడ్యుయేట్లు ఓటుతో దునుమాడినట్లు కనిపిస్తోంది. విశాఖ రాజధాని అన్నా సానుకూలంగా స్పందించలేదు. చివరకు జనసేన మద్దతుదారులు కూడా టీడీపీకే ఓటేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. తూర్పు రాయలసీమ నియోజకవర్గంలో వైసీపీతో పోల్చుకుంటే టీడీపీ పెద్దగా ప్రచారం చేసిన దాఖలాల్లేవు. పశ్చిమ రాయలసీమ నియోజకవర్గంలో కర్నూలు న్యాయ రాజధాని అంటూ హడావుడి చేసినా అధికార పార్టీని పట్టభద్రులు విశ్వసించలేదు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీతో ఉపాధి అవకాశాలు పెంచుతామన్న సీఎం జగన్ మాటలు, చేతలనూ నమ్మలేదు. 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు. నాలుగేళ్లలోనే అంతకన్నా వేగంగా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అదే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిఫలించినట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కొంపముంచిన అతి విశ్వాసం?
మరోవైపు అధికార వైసీపీ మితిమీరిన ఆత్మ విశ్వాసంతో వ్యవహరించడం కూడా టీడీపీ విజయానికి దోహదపడినట్లు క్షేత్ర స్థాయి వివరాలు వెల్లడిస్తున్నాయి. కనీస చదువులేని వాళ్లను ఓటర్లుగా చేర్పించారనే అక్కసు గ్రాడ్యుయేట్లలో వ్యక్తమైంది. అధికారులు ఇష్టారీతిన ఓటరు జాబితాలు రూపొందించడాన్ని పట్టభద్రులు సహించలేకపోయారు. అందుకే ఉత్తరాంధ్రలో వైసీపీని ఓడించాలనే పట్టుదలతో ఓటేసినట్లు కనిపిస్తోంది. ఇక్కడ వైసీపీకి 30 శాతం ఓట్లు పడితే టీడీపీకి 43.88 శాతం ఓట్లు వచ్చాయి. అదే తూర్పు రాయలసీమలో టీడీపీకి 45.30 శాతం వస్తే వైసీపీకి 34.52 శాతం మాత్రమే దక్కాయి. దాదాపు పదిశాతానికి పైగా వ్యత్యాసం ఉంది. ఇవే ఫలితాలు రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ ఉంటాయని టీడీపీ బలంగా నమ్ముతోంది.
పునరాలోచనలో బీజేపీ..
పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ విజయంతో రాష్ట్ర బీజేపీ నాయకుల్లో ఆలోచన మొదలైనట్లు కనిపిస్తోంది. వైసీపీతో తమ పార్టీ పెద్దల లోపాయికారి బంధం వల్లే ఇక్కడ తాము డిపాజిట్లు కోల్పోయినట్లు ఆ పార్టీ నేత విష్ణుకుమార్‌రాజు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. దీన్నిబట్టి రానున్న కాలంలో బీజేపీ ఢిల్లీ పెద్దల వైఖరిలో మార్పు రావొచ్చని భావిస్తున్నారు. తెలుగు తమ్ముళ్ల గెలుపు అటు జనసేనలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటిదాకా సీఎం పదవితోపాటు మరిన్ని సీట్లు బేరసారాలు కొనసాగించాలనుకున్నారు. ఇక అలా బెట్టు చేయడానికి వీలుకాదని తెలుస్తోంది. టీడీపీ ఒంటరిగా బరిలో నిలిచినా తిరుగులేని ఆధిక్యతను కొనసాగిస్తుందనే ధీమా తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది. దీంతో రాష్ట్ర రాజకీయ సమీకరణల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటాయని విశ్లేషకుల అంచనా.