వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు: నోటీసులు ఇవ్వాలన్న తెలంగాణ హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ఆస్తులపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది.

Update: 2023-12-15 10:58 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ఆస్తులపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. వైఎస్ జగన్ అక్రామస్తుల కేసుపై మాజీ ఎంపీ హరిరామజోగయ్య ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిల్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్‌తోపాటు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. అయితే ప్రతివాదులు అందరికీ ఇప్పటికీ నోటీసులు అందలేదని తెలుస్తోంది. ఇంతలో ప్రజాప్రతినిధుల కేసులను త్వరగా విచారించాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు మరింత అలర్ట్ అయ్యింది. తెలంగాణ హైకోర్టు ప్రజాప్రతినిధుల కేసులను సుమోటో పిల్ రూపంలో విచారిస్తోంది. ఈ ప్రజాప్రతినిధుల కేసుల సుమోటో పిల్‌ను, జగన్ కేసులపై దాఖలైన పిల్‌తో జతపరచాలని కోర్టు రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను ఎన్నికలలోపు పూర్తి చేయాలని మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య తన పిటిషన్‌లో కోరారు. వైఎస్ జగన్‌కు చెందిన ఇంకా 20 కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నట్లు చేగొండి హరిరామ జోగయ్య తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ వాదనలపై సీబీఐ తరఫు న్యాయవాది స్పందించారు. డిశ్చార్జి పిటిషన్ల పెండింగ్‌పై సీబీఐ కోర్టులో మెన్షన్ చేసినట్టు తెలంగాణ హైకోర్టు దృష్టికి తెలియజేశారు. ఇరు వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు డిశ్చార్జి పిటిషన్లపై రెండు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సీబీఐని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను మూడు నెలలకు వాయిదా వేసింది.

Tags:    

Similar News