పల్నాడులో ఎర్ర మట్టి దందా..15 ఎకరాల అసైన్డ్ భూమికి ఎసరు

అధికార యంత్రాంగం అంతా వరద సహాయ చర్యల్లో నిమగ్నమైన వేళ పల్నాడులో ఎర్ర మట్టి దందా మొదలైంది.

Update: 2024-09-11 12:43 GMT

దిశ,పల్నాడు:అధికార యంత్రాంగం అంతా వరద సహాయ చర్యల్లో నిమగ్నమైన వేళ పల్నాడులో ఎర్ర మట్టి దందా మొదలైంది. నకరికల్లు రాజుపాలెం మండలాల్లోని పలు చోట్ల కొండ భూములు మరికొన్ని చోట్ల అసైన్డ్‌ భూముల్లో అడ్డగోలుగా ఎర్ర మట్టి తవ్వకాలు చేపట్టి వందలాది వాహనాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎర్ర మట్టి అక్రమ రవాణా తో భారీగా జేబులు నింపుకుంటున్నారు అక్రమార్కులు. అయితే ఇంత జరుగుతున్నా అటవీ రెవెన్యూ శాఖల అధికారులు స్పందించక పోవడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజుపాలెం మండలం లోని బీరవల్లిపాయ చౌటపాపాయపాలెం ఆర్ అండ్ ఆర్ సెంటర్ మార్గం మధ్యలోని కొండ ప్రాంతంలో 15 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్‌ భూమి ఉంది. ప్రస్తుతం అధికారులు వరద బాధితుల సహాయక చర్యల్లో ఉండడాన్ని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు ఈ ప్రాంతాన్ని మట్టి అక్రమ తవ్వకాలకు కేరాఫ్‌గా మార్చారు. చుట్టూ కొండ ప్రాంతం కావడంతో ఈ భూమిపై కన్నేసిన కొందరు అక్రమ మార్గంలో మట్టిని తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. గతంలో ప్రభుత్వం పేదలకు పంచిన అసైన్డ్‌ భూమిలో ఇంతవరకు ఆ భూమిలో ఎవరు నివాసాలు ఏర్పాటు చేసుకోకపోవడంతో అసైన్డ్‌ భూమిలో యంత్రాలను ఏర్పాటుచేసి మట్టిని తరలిస్తున్నారు.

అలసత్వం వెనుక అసలు నిజం ఏంటి..??

ఎన్నోఏళ్ల క్రితం కొందరు నిరుపేదలకు అసైన్డ్‌ భూమిని పంపిణీచేసిన ఇంతవరకు ఆ భూమిలోకి ఎవరూ రాకపోవటంతో అసైన్డ్‌ భూమిలో యంత్రాలను ఏర్పాటుచేసి మట్టిని తరలిస్తున్నారు.దీంతో ప్రతిరోజు మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు. చుట్టూ అటవీ భూమి కావడంతో ఒక్కోసారి ఆ భూమిలో కూడా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇప్పటికే అసైన్డ్‌ భూమిలో గుంతలు పెద్దవి అయ్యాయి. మట్టి తవ్వకాలు చేపట్టడంతో ఈ గుంతలతో మునుముందు వర్షాలు పడితే ప్రమాదాలు జరిగే ప్రమాదం పొంచి ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భూమి పై అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయకుంటే అక్రమ మట్టి తవ్వకాలు పెరిగే అవకాశం ఉంది. కొందరు మట్టిని అమ్మకాలు చేసి సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

పొంచివున్న ప్రమాదాలు..

రెవెన్యూ, అటవీ శాఖ అలసత్వంతో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. కొందరు అధికారులు అవినీతికి పాల్పడడం వలన రవాణా జరుగుతోంది. ట్రాక్టర్ల వేగంతో ప్రమాదాలు జరిగే విధంగా ఉన్నాయి. అనుమతులు లేని మట్టి తవ్వకాలు నిరోధించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలి. నియంత్రణ లేని అతివేగం మట్టి రవాణా చేసే ట్రాక్టర్లు, టిప్పర్లు వేగానికి ఇతర వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. పెద్ద సంఖ్యలో ట్రిప్పులు వేయాలనే లక్ష్యంతో వాహనాలను అత్యంత వేగంగా గమ్యస్థానానికి చేర్చి అక్కడి నుంచి తిరిగి క్వారీకి వెళ్తున్నాయి. ఈ క్రమంలో ప్రమాదాలు జరుగుతాయనే ఆరోపణలు, ఆందోళన వ్యక్తమవుతోంది. మట్టి రవాణా చేసే పలు ట్రాక్టర్లకు కనీసం సరైన డాక్యూమెంట్స్‌ కూడా లేవనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా వాహనాలకు సంబందించిన ఇన్సూరెన్స్‌ పత్రాలు కూడా లేకపోవడంతో ప్రమాద సమయంలో భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఫిట్‌నెస్‌ లేని వాహనాలను కూడా మట్టి రవాణాకు వినియోగిస్తున్నారని పలువురు ఫిర్యాదు చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


Similar News