సీఎం జగన్ సమీక్షలో ఎమ్మెల్సీ అనంతబాబు.. సస్పెండైనా ప్రత్యక్షమవ్వడంపై మండిపాటు
దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో : దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిల్‌పై అనంతబాబు ఉన్నారు. అనంతబాబు తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మరణానికి తానే బాధ్యుడిని అంటూ పోలీసుల విచారణలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రెస్‌మీట్‌లో పోలీసులు వెల్లడించారు. ఎమ్మెల్సీ అనంతబాబు వాంగ్మూలం పట్ల వైసీపీ సీరియస్ అయ్యింది. మే 25న పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే బెయిల్‌పై విడుదలైన అనంతబాబు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈనెల 26న తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఎమ్మెల్సీ అనంతబాబు హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. సమీక్షలో ఎమ్మెల్సీ అనంతబాబు పాల్గొన్న ఫోటోలు రిలీజ్ అయ్యాయి. దీంతో వైసీపీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ నుంచి సస్పెండ్ చేశాం అన్నారు మరి ఇదేంటని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్విటర్ వేదికగా స్పందించారు. పార్టీ నుంచి సస్పెండ్ చేశామంటూ పత్రికా ప్రకటన కూడా ఇచ్చిన వైసీపీ.. ఇప్పుడు ఎమ్మెల్యేల మీటింగ్ లో అనంత బాబును ఎలా కూర్చోబెట్టిందని ప్రశ్నించారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయడమంటే ఇదేనా? అంటూ నిలదీశారు. తన మాజీ డ్రైవర్ మరణానికి కారణం తానేనంటూ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తిని మీటింగ్ లో కూర్చోబెట్టడానికి సిగ్గుందా జగన్? అంటూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రంగా మండిపడ్డారు.