ఆఖరి పోరాటం.. 2024లో ఆ మూడు పార్టీలకూ అగ్ని పరీక్షే!

2024 ఎన్నికలు మూడు పార్టీలకూ ఆఖరి పోరాటం అనే చెప్పాలి. ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన వారే ధన్యులు.. లేని పక్షంలో ప్రతిపక్ష పాత్ర కాదు కదా.. కనీసం రాష్ట్రంలో మనుగడ సాగించడం కూడా కష్టమే అని చెప్పాలి.

Update: 2023-05-10 03:33 GMT

దిశ, ఉభయ గోదావరి ప్రతినిధి: 2024 ఎన్నికలు మూడు పార్టీలకూ ఆఖరి పోరాటం అనే చెప్పాలి. ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన వారే ధన్యులు.. లేని పక్షంలో ప్రతిపక్ష పాత్ర కాదు కదా.. కనీసం రాష్ట్రంలో మనుగడ సాగించడం కూడా కష్టమే అని చెప్పాలి. కేవలం పార్టీలకే కాదు.. పత్రికలు, చానళ్లకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. దీంతో అన్ని పార్టీలు, పత్రికలు, చానళ్లు కూడా 2024 ఎన్నికలను చావో రేవో‌గా తీసుకొంటున్నాయి. ప్రతి సీటూ గెలిచి తీరాల్సిందే. ప్రతీ ఓటు పడి తీరాల్సిందే. దీని కోసం ఎంతైనా చేస్తున్నారు. ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. సర్వేల మీద సర్వేలు చేయిస్తున్నారు. నియోజకవర్గాల్లో అభ్యర్థులు, ఇతర నాయకులు ఎంత ప్రయత్నాలు చేస్తున్నా, అధినాయకుల ప్రసన్నత కోసం ఎంతగా తహతహలాడుతున్నా అధిష్ఠానం అంతగా పట్టించుకోవడం లేదు. కేవలం గెలుపు గుర్రాలకు మాత్రమే సీటు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. ఆయన చంద్రబాబుకు దగ్గరి బంధువైనా, ముఖ్యమంత్రి జగన్‌కు బాగా కావాల్సిన వాడైనా, పవన్‌కు ఆప్తమిత్రుడైనా సరే అతనికి అర్హత కేవలం గెలవడమే.. అది ఉంటేనే అతనికి సీటు ఇస్తారు. లేకపోతే పక్కన పెడతారు. దీని కోసం అనేక సర్వేలు చేయిస్తున్నారు. విచారణలు చేయిస్తున్నారు. ఆరాలు తీస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాకపోయినా ఆ పార్టీ మనుగడ పూర్తిగా కష్టతరం అవుతుంది. 2029 నాటికి కనుమరుగు అవుతుంది. ఇదే తాజా రాజకీయాల్లో కొనసాగుతున్న స్ట్రాటజీ.. దీంతో 24 ఎన్నికల ఫీవర్ అందరికీ పట్టుకుంది. ప్రతీ క్షణం విలువైనదిగా వారు భావిస్తున్నారు. ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ విషయమై ‘దిశ’అందిస్తున్న ప్రత్యేక కథనం..

కసిగా చంద్రబాబు

2024లో ఎలాగైనా ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవడం కోసం చంద్రబాబు నానా అవస్థలు పడుతున్నారు. వయస్సు మీద పడుతున్నా అవేమీ పట్టించుకోకుండా అహర్నిశలూ కష్టపడుతు న్నారు. ఈ సారి ఎలాగైనా చంద్రబాబు అధికారంలోకి వచ్చి తీరాలి. లేని పక్షంలో ఆయనకు సినిమా కష్టాలన్నీ వైసీపీ నాయకులు చూపిస్తారు. ఆ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. అందుకే తండ్రీ కొడుకులు నానా అవస్థలు పడుతున్నారు. గెలుపు గుర్రాలకే సీటు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. వారు ఎంతటి దగ్గర వారైనా, రక్త సంబంధీకులైనా, పార్టీలో ఎంత సీనియర్ అయినా సరే నోచాన్స్.. కేవలం గెలిచే అర్హత మాత్రమే ఉండాలి. అటువంటి వారు ఎంత చిన్న వయస్సు వారైనా కనీస అర్హత లేకపోయినా సరే వారికే సీటు ఇవ్వనున్నారు. అంతేగాక టీడీపీ ఈ ఎన్నికల్లో డబ్బుకు కూడా ప్రాధాన్యత ఇవ్వనుంది. బాగా సొమ్ములు ఖర్చు పెట్టే వారికే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఓ పక్కన సర్వేలో మంచి రిపోర్టు రావాలి. దీనికి తోడు డబ్బు కూడా ఉండాలి. అటువంటి అభ్యర్థులకు మాత్రమే సీట్లు ఇస్తారు. చివరికి మంగళగిరిలో సర్వేలో లోకేష్ గెలుపు కష్టం అని సర్వే రిపోర్టు వచ్చినా సరే ఆయనకు బదులు వేరే వ్యక్తికి సీటు ఇస్తారు. ఇదీ తాజాగా టీడీపీలో అంతరంగిక పరిస్థితి.

జగన్ దూకుడే దూకుడు

ఇక వైసీపీ విషయానికి వస్తే 24లో వైనాట్ 175 అంటూ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కానీ క్షేత్ర స్థాయిలో అంత సీన్ లేదు. కేవలం నవరత్నాల మీదనే జగన్ ఆధారపడ్డారు.

అభివృద్ధి జాడ కనపడటం లేదు. అయితే 24లో మరోసారి అధికారంలోకి రావడానికి జగన్ అన్ని చర్యలు తీసుకొంటున్నారు. అధికారంలో ఉన్న పార్టీ అవ్వడం వల్ల

ఆయనకు అన్నీ సాధ్యంగానే ఉన్నాయి. నవరత్నాలతో బాటు ఇతర పథకాలు, పనులు కూడా చేయిస్తున్నారు. దీనికి తోడు 24 ఎన్నికల్లో డబ్బులు అధికంగా ఖర్చు చేసే

పార్టీ వైసీపీ అని చెప్పాలి. 24లో ఒక్కసారి అధికారంలోకి వస్తే చాలు.. భవిష్యత్తులో ప్రతిపక్షాల బెడద పూర్తిగా తొలగిపోతుంది. ముఖ్యంగా చంద్రబాబు సీన్ కూడా అయిపోతుంది.

అదే ఆలోచనలో వీరు కూడా గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. గెలుపు గుర్రాల కోసం వెతుకులాట ప్రారంభించారు.

జనసేనలో అంతర్మథనం

జనసేన 2014లో టీడీపీకి సపోర్టు చేసింది. 2019లో సొంతంగా పోటీ చేసి చతికిల పడింది. 24లో టీడీపీతో పొత్తు అంటోంది. అయితే టీడీపీతో పొత్తు ఎటు దారి తీస్తుందో వారికే అర్థం కావడం లేదు. అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి ఎవరి చేపడతారు అనేది క్లారిటీ  లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే పవన్ పరిస్థితి ఏంటీ అనే ఆలోచన వేధిస్తోంది. పవన్ ముఖ్యమంత్రి కాకుండా ఐదు సంవత్సరాలు ఏం చేస్తారు. అప్పుడు కేడర్ పరిస్థితి ఏంటీ ఇలా ఎన్నో ప్రశ్నలు జనసైనికులను చుట్టుముడుతున్నాయి.

పత్రికలు, చానళ్ల మాటేంటీ?

టీడీపీ అధికారంలోకి వస్తే ఎన్టీవీ, టీవీ-9, సాక్షిపై దాడికి సిద్ధం అవుతారు. వాటి మనుగడ కష్టం చేస్తారు. ఇటీవల రాజమండ్రి సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మేరకు స్పష్టం చేశారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయితే కేవలం ఈనాడు, ఏబీఎన్, టీవీ-5 లు చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటాయి. ఇప్పటికే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ప్రింట్‌కు బదులు ఈ పేపర్‌గా మారిపోవడానికి రంగం సిద్ధం చేసుకొన్నట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి:

చంద్రబాబు చాణక్యం..‘కన్నా’రా!?  

Tags:    

Similar News