దక్కని తక్షణ ఉపశమనం: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌‌మెంట్ స్కాం కేసులో సుప్రీంకోర్టులో కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తక్షణ ఉపశమనం కలగలేదు.

Update: 2023-10-13 10:05 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌‌మెంట్ స్కాం కేసులో సుప్రీంకోర్టులో కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తక్షణ ఉపశమనం కలగలేదు. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై శుక్రవారం తీర్పు వెల్లడయ్యే అవకాశం ఉందని టీడీపీ భావించింది. అయితే ఈ కేసులో వాదనలు విన్న జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. శుక్రవారం మధ్యాహ్నాం 2 గంటలకు జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం వాదనలు వింది. సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. అయితే మిగిలిన వాదనలు మంగళవారం వింటామని ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. అనంతరం ఏపీ ఫైబర్ నెట్ కేసుపై ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులోనూ ముందస్తు బెయిల్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే తనపై ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలని చంద్రబాబు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన సుప్రీం కోర్టులో సవాలు చేశారు. ఈ మేరకు చంద్రబాబు పిటిషన్‌పై జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇదే ధర్మాసనం శుక్రవారం కూడా కొనసాగింపుగా వాదనలు వింది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, అభిషేక్ మనుసంఘ్వీ వాదనలు వినిపించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ కేసు విచారణలో వాదనలు అంతా అవినీతి నిరోధక చట్టంలోని 17ఏ చుట్టూనే జరుగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు 17ఏ వర్తిస్తుందని హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. అయితే సెక్షన్ 17ఏ చంద్రబాబుకు ససేమిరా వర్తించదని న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా సెక్షన్ 17ఏ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. 

Tags:    

Similar News