దండుపాళ్యం బ్యాచ్ తాటాకు చప్పుళ్లకు భయపడం: Kinjarapu Atchannaidu
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సహా ఆరుగురు టీడీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్పందించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సహా ఆరుగురు టీడీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్పందించారు. కేసులు నమోదు చేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఇదో పిరికిపంద చర్యగా అభివర్ణించారు. లోకేశ్ అడుగు బయటపెట్టినా, మైక్ పట్టుకున్నా, బహిరంగ సభ పెట్టినా వైసీపీ నేతల్లో వణుకు పుడుతోందని చెప్పుకొచ్చారు.
జగన్ అరాచక పాలన, వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను యువగళం పాదయాత్ర ద్వారా క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంతో ఇలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి సమాధి కడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విమర్శించడం నేరంగా మారిందని.. పాలన చేతకాక ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టి డైవర్షన్ రాజకీయం చేయడం సిగ్గుచేటంటూ అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ప్రతి పక్షాలను అణిచి వేస్తున్నారని విరుచుకుపడ్డారు.
నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాని జీవో-01ను అడ్డుపెట్టుకుని కొంతమంది పోలీసులు జగన్‌కి పాలేరుల్లా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలమనేరులో బహిరంగ సభకు వేలాదిగా జనం పోటెత్తడం చూసి జగన్‌కు గుండెపోటు వచ్చినంత పనవ్వడంతో.. వెంటనే డీఎస్పీతో ప్రచార రథాన్ని సీజ్ చేయాలని ఆదేశించారని ఆరోపించారు. జగన్ దండుపాళ్యం తాటాకు చప్పుళ్లకు భయపడం. ఇటువంటి తల తోకా లేని కేసులు మా నేతల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేవు అని చెప్పుకొచ్చారు. యువగళం పాదయాత్ర ద్వారా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మా పోరాటం ఆగదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
READ MORE