నన్ను చంపేందుకు రూ. కోటి ఆఫర్: పోలీసులకు రామ్ గోపాల్ వర్మ ఫిర్యాదు
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై అమరావతి ఉద్యమనేత కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో : వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై అమరావతి ఉద్యమనేత కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సమాజానికి కంటకంగా మారిన రాంగోపాల్ వర్మ తలను నరికి తెచ్చిన వారికి రూ. కోటి నజరానా చెల్లిస్తానంటూ బంపరాఫర్ ప్రకటించిన సంగతి తెలసిందే. ఓ టీవీ ఛానెల్లో నిర్వహించిన లైవ్ డిబేట్లో కొలికపూడి శ్రీనివాసరావు ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై రాంగోపాల్ వర్మ రియాక్ట్ అయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ఏపీ పోలీసులకు విన్నపం. నన్ను చంపేందుకు రూ. కోటి ఆఫర్ ప్రకటించిన కొలికపూడి శ్రీనివాసరావుపై, ఆయనను రెచ్చగొట్టేలా మాట్లాడిన యాంకర్ సాంబశివరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోండి. ఇదే నా అఫీషియల్ కంప్లైంట్ గా భావించండి’ అంటూ వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఈ మేరకు కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యల వీడియోను సైతం ట్విటర్ వేదికగా రామ్ గోపాల్ వర్మ షేర్ చేశారు.
అసలు వివాదం ఇదీ
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వ్యూహం సినిమా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ నారా లోకేశ్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమాను రిలీజ్ చేయకుండా ఆపాలంటూ నారా లోకేశ్ కోర్టును కోరారు. దీనిపై న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది. ఆర్జీవి వ్యూహం మూవీలో చంద్రబాబు, లోకేశ్, చిరంజీవి, పవన్ కల్యాణ్ లను కించపరిచేలా చూపించారంటూ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై ఓ ప్రముఖ టీవీ ఛానెల్లో డిబేట్ జరిగింది. ఈ డిబేట్లో కొలికపూడి శ్రీనివాసరావు సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొలికపూడి శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవి తల నరికి తెస్తే రూ. కోటి ఇస్తానంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు.