కంటి ఆపరేషన్‌కు బెయిల్ ఇస్తే.. ధర్మం గెలిచినట్టా?: మంత్రి అంబటి రాంబాబు
స్కిల్ డవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ డవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. చంద్రబాబు అనారోగ్య సమస్యల దృష్ట్యా నాలుగు వారాలపాటు షరతులతో కూడిని బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. దీంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడంపై మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు కళ్లు కనిపించడం లేదని, కంటి ఆపరేషన్ జైల్లో చేయలేరు కాబట్టే మధ్యంతర బెయిల్ వచ్చిందని, కంటి ఆపరేషన్ తరువాత చంద్రబాబు జైలుకు వెళ్లాల్సిందేనని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.గుంటూరులో మంగళవారం మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై మాట్లాడారు. అనారోగ్య కారణాలతో హైకోర్టు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే.. దానికి న్యాయం గెలిచిందని టీడీపీ హంగామా చేస్తుందని విమర్శించారు. ఆపరేషన్ కోసం బెయిల్ ఇస్తే న్యాయం, ధర్మం గెలిచిందని మాట్లాడటం సమంజసం కాదని, ఇంకా నిజం గెలవలేదు.. కేసు దర్యాప్తు కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో టీడీపీ జెండా పీకేశారని, వచ్చే ఎన్నికల్లో ముందో, తరువాతో ఏపీలోనూ జెండా పీకేస్తారని ఎద్దేవా చేశారు.
తాత్కాలిక ఉపశమనం కలిగితే అంత హంగామా ఎందుకో?
చంద్రబాబుకు ఉన్న ఆరోగ్య సమస్యల నేపథ్యంలో, మరో కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాలనే విన్నపంతో హైకోర్టు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని అన్నారు. అంతమాత్రాన టీడీపీ వాళ్ళు న్యాయం గెలిచిందని, సత్యం గెలిచిందని, ధర్మం గెలిచిందని నానా హంగామా చేస్తున్నారని మండిపడ్డారు. నిజం గెలిచి చంద్రబాబు బయటకు రాలేదు అన్నది టీడీపీ శ్రేణులు తెలుసుకోవాలని సూచించారు. కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకుని నాలుగు వారాల్లో తిరిగి మీరు రిమాండ్ కు రావాలని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. ఇది ఒక తాత్కాలిక రిలీఫ్ మాత్రమే. కోర్టు ఇచ్చిన నిబంధనలను పాటిస్తూ, నాలుగు వార్వాల తర్వాత మళ్ళీ చంద్రబాబు జైలులో సరెండర్ కావాలి అని మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు ఇంతకుముందు కూడా ఏసీబీ కోర్టు ఒక రిలీఫ్ ఇచ్చింది. ఆయన ఆరోగ్య రీత్యా, వేడి వాతావరణం వల్ల ఆయనకు చెమటలు పడుతున్నాయని, దానివల్ల శరీరంపై దురదలు పెరుగుతున్నాయంటే.. ఏసీలు ఏర్పాటు చేయమని కోర్టు చెప్పింది. ఇవాళ హైకోర్టు ఇచ్చింది కూడా మరో రిలీఫ్.. రాజమండ్రి సెంట్రల్ జైలులో కంటి ఆపరేషన్ చేయలేరు కాబట్టి, ఆయన కంటి సమస్యల దృష్ట్యా ఇచ్చిన మరో రిలీఫ్ మాత్రమేనని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
చంద్రబాబుపై ఆరోపణలు వస్తే లోకేశ్ ఏం పీకారు
చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వస్తే ఆయన తనయుడు లోకేష్ యుద్ధం మొదలైంది అనడంపై సెటైర్లు వేశారు. ఇప్పుడే మొదలైతే మరి ఎర్ర డైరీ పట్టుకుని రాసుకుంటున్నాను, యుద్ధం మొదలైంది అని అప్పుడెందుకు అన్నారని ప్రశశ్నించారు. చంద్రబాబుపై ఇన్ని ఆరోపణలు వచ్చినా.. ఏం పీకారని అని నిలదీశారు. టీడీపీ నేతలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం, అత్యుత్సాహంతో నోటికొచ్చినట్లు మాట్లాడటం మంచి పద్ధతి కాదు అని విమర్శించారు. చంద్రబాబు పూర్తి రిలీఫ్‌తో బయటకు ఏమీ రాలేదని..మధ్యంతర బెయిల్ ఇస్తే దీనికి ఊరేగింపులు, సంబరాలు చేసుకోవడం అంటే అంతకంటే అజ్ఞానం మరొకటి ఉండదు అని అంబటి రాంబాబు హితవు పలికారు.
నెక్ట్స్ ఏపీలోనూ జెండా పీకేస్తారు
ఎక్కడైతే ఎన్టీఆర్ టీడీపీని ప్రారంభించారో, స్థాపించారో, ఆ పార్టీ జెండా పాతారో.. ఎక్కడైతే హైదరాబాద్ నడిబొడ్డులో టీడీపీ జెండా ఎగురవేశారో.. అక్కడే టీడీపీ జెండాను చంద్రబాబు పీకేశాడు అని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్ అయింది. అక్కడ ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జ్ఞానేశ్వర్ కు జ్ఞానోదయం అయింది. జ్ఞానేశ్వర్ ను పార్టీ అధ్యక్షుడిగా పెట్టి, ఆయన చేత డబ్బులు ఖర్చు పెట్టించి, బీసీలకు పట్టం కడతామని చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పి, చివరికి ఆ పార్టీ జెండానే పీకేసే పరిస్థితికి వచ్చారు అని విమర్శించారు. ఎన్నికలకు నెల రోజుల ముందు వరకూ.. తెలంగాణలో పోటీ చేస్తామని, అభ్యర్థుల జాబితాను తయారు చేయాలని జ్ఞానేశ్వర్ కు చెప్పి, ఈలోపే పార్టీ జెండాను చంద్రబాబు పీకేశారు. తెలంగాణలో పోటీ చేయకుండా పారిపోయారు అని ఎద్దేవా చేశారు. ఆంధ్రాలో కూడా ఎన్నికల ముందో,ఆ తర్వాతో టీడీపీ జెండా పీకేస్తారు అని చెప్పుకొచ్చారు. బహుశా ఎన్నికల తర్వాత పీకేస్తారు. ఇది ఖాయం అని హెచ్చరించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఫోన్లు చేస్తుంటే లోకేశ్ ఫోన్లు కూడా ఎత్తడం లేదట. లోకేశ్ వల్లే సర్వనాశనం అయిందని కూడా జ్ఞానేశ్వర్ చెప్పాడు అని అంబటి గుర్తు చేశారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా టీడీపీకి చంద్రబాబు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే తెలంగాణాలో ఆ పార్టీ జెండా పీకేయడమేనని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.