నిను వీడని నీడను నేనే..! మాజీ ఎంపీని వెంటాడుతోన్న గతం

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను గతం వెంటాడుతోంది.

Update: 2024-09-20 02:22 GMT

దిశ, మంగళగిరి: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను గతం వెంటాడుతోంది. అమరావతి రాజధాని ప్రాంతంలో గత ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసం, ఆరాచకాలు, దందాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. రాజధాని అమరావతి విచ్ఛిన్నమే లక్ష్యంగా ఆయన వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలోని ఆయన నివాసం నుంచే రాజధాని విధ్వంసానికి అడుగులు పడ్డాయని బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. బహుజన పరిరక్షణ సమితి పేరుతో మూడు రాజధానుల ముఠా సభ్యులు క్రియాశీలకంగా వ్యవహరించారు.

సత్యకుమార్‌పై దాడి.. నో యాక్షన్..

బీజేపీ నేత మంత్రి సత్యకుమార్ అప్పట్లో నిరసన తెలియజేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు రాజధాని అమరావతి వచ్చారు. ఈ క్రమంలో మూడు రాజధానుల శిబిరం వద్ద ఆయన కాన్వాయిపై దాడి జరిగింది. సత్యకుమార్ సిబ్బందిపై విచాక్షణ రహితంగా మూడు రాజధానుల ముఠా సభ్యులు దాడి చేసి పరుగులు పెట్టించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ ఘటనపై చర్యలు లేకపోవడం గమనార్హం.

మంగళగిరి నుంచే జనం తరలింపు 

మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల నుంచి మూడు రాజధానుల శిబిరానికి జనాన్ని తరలించి పెయిడ్ ఉద్యమం జరిపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అమరావతి మద్దతుదారుపై కేసులు పెట్టించారు.. దాడులు చేయించారు. బయట ప్రాంతం నుంచి దళితులను తీసుకువచ్చి రాజధానికి వ్యతిరేకంగా పెయిడ్ ఉద్యమం చేయించడంపై స్దానిక రాజధాని గ్రామాల దళితులు తీవ్ర ఆగ్రహం వ్యక్త చేశారు.

దళితులపైనే అట్రాసిటీ కేసు 

మంగళగిరి నుంచి ఆటోలలో 2020 అక్టోబర్ 10న మూడు రాజధానుల పెయిడ్ ఉద్యమకారులను మంగళగిరి కృష్ణాయపాలెం దళితులు అడ్డుకున్నారు. ఆ ఘటనలో మాజీ ప్రజాపత్రినిధి పీఏ క్రియాశీలకంగా వ్యవహరిం, గొడవలు సృష్టించి తీవ్ర ఉద్రిక్తత పరిస్దితులను కల్పించారు. బలవంతంగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఈపూరి రవితో ఫిర్యాదు చేయించారు. అనంతరం 15 రోజులకు ఆయన కేసును విరమించుకున్నారు. దీనిని పరిగణనలోకి తీసుకొని పోలీసు అధికారులు.. కృష్ణాయపాలేనికి చెందిన 11మంది దళితులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి, అప్పటికపుడే ఏడుగురిని ఆరెస్ట్ చేసి జైలుకు పంపారు. అప్పట్లో రాష్ట్రంలోనే ఈ కేసు సంచలనం కలిగించింది.

హత్యాయత్నం, కుట్ర కేసులు 

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేశ్‌‌ను ఆరెస్ట్ చేయగా ప్రస్తుతం ఆయన రిమాండ్‌లో ఉన్నారు. 2020లో జరిగిన ఓ వృద్దురాలి హత్యకేసులో ఈయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు. దీనిపై పీటీ వారెంట్ పిటిషన్‌ను గురువారం మంగళగిరి కోర్టులో తుళ్లూరు పోలీసులు దాఖలు చేశారు. 2020 డిసెంబర్ 28న వెలగపూడి లో రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో గాయపడిన వృద్దురాలు మెండెం మరియమ్మ మృతి చెందింది. మృతురాలి కొడుకు నందిగం సురేశ్, ఆయన అనుచరులపై ఫిర్యాదు చేశాడు. కాగా, తాజాగా పడవలతో ప్రకాశం బ్యారేజ్ కూల్చివేతకు యత్నం కుట్ర కేసులో కూడా పిటీషన్ వేసే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారంగా తెలుస్తుంది.

అడుగడుగునా దోపిడీ 

అమరావతి రాజధాని ప్రాంతంలో వైసీపీ పాలనలో అంతు లేని విధంగా ప్రభుత్వ ఆస్తి దోపిడికి గురైయింది. సీడ్ యాక్సెస్, రాజధాని అభివృద్ది పరిచిన రోడ్లను ఎక్స్‌కవేటర్లతో తవ్వి గ్రావెల్‌ను రాత్రికి రాత్రే లారీలు, ట్రాక్టర్లతో తరలించి అమ్ముకున్నారు. రాజధాని నిర్మాణ కాంట్రాక్ట్ సంస్ద‌లకు చెందిన ఇనుము, ఇసుక, భారీ పనిముట్లును దోచుకున్నారు. దీనిపై తుళ్లురు, తాడికొండ, తాడేపల్లి, మంగళగిరి పోలీస్ స్టేషన్ల పరిధిలో మొక్కుబడిగా కేసులు నమోదయ్యాయి. మంగళగిరి మండలం యర్రబాలెం లో ఓ ఐరన్ స్క్రాప్ దుకాణాదారుడు రాజధాని లో దొంగిలించిన సొత్తును కొనుగొలు చేసి కోట్లకు పడగలేత్తాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహరాలన్నింటిపై మంత్రి నారా లోకేశ్, హోం మంత్రి అనిత దృష్టి సారించాలని అమరావతి రైతులు కోరుతున్నారు.


Similar News