ఎంపీ రఘురామ కు పదవీ గండం..?

Update: 2022-01-29 13:21 GMT

దిశ, ఏపీ బ్యూరో : నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పదవీ గండం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. రఘురామపై అనర్హత వేయించడమే లక్ష్యంగా వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ అంశంపై ఇప్పటికీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శనివారం స్పందించారు అనర్హత పిటిషన్‌పై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా విచారణకు ఆదేశించారు. రఘురామ కృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. వైసీపీ చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఎంపీ రఘురామ పై చర్యలు తీసుకుని అనర్హత వేటు వేయాలని కోరారు. అయితే వైసీపీ చీఫ్ విప్ ఇచ్చిన ఫిర్యాదును స్పీకర్‌ ఓంబిర్లా ప్రివిలేజ్‌ కమిటీకి పంపించారు.

రఘురామకృష్ణరాజు అనర్హత పిటిషన్‌పై త్వరితగతిన విచారణ జరిపి ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ప్రివిలేజ్ కమిటీని ఆదేశించారు. ఇకపోతే ఫిబ్రవరి 3న ప్రివిలేజ్‌ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలోపు నివేదిక సమర్పిస్తే రఘురామపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇకపోతే తనపై అనర్హత వేటు వేయించే దమ్ము వైసీపీకి లేదని ఎంపీ రఘురామ చెప్తున్నారు. తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే లేదన్నారు. తనపై ఎవరికి ఫిర్యాదు చేసుకున్నా అనర్హత వేటు వేయడం అసాధ్యమని చెప్పుకొచ్చారు. అంతేకాదు తనపై అనర్హత వేటు వేయించుకోవాలని వైసీపీకి సవాల్ సైతం విసిరారు. అనర్హత వేటు వేయించలేమని వైసీపీ చెప్తే తానే స్వయంగా ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని రఘురామ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News