కుప్పం కేంద్రంగా చంద్రబాబు భారీ స్కెచ్!

ఏపీ రాజకీయం ఇప్పుడు కుప్పం చుట్టూ తిరుగుతోంది.

Update: 2023-01-25 02:29 GMT

దిశ, తిరుపతి : ఏపీ రాజకీయం ఇప్పుడు కుప్పం చుట్టూ తిరుగుతోంది. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని వైసీపీ నేతలు సవాల్ చేస్తున్నారు. సీఎం ఆదేశిస్తే తాను చంద్రబాబుపై పోటీ చేసి గెలుస్తానంటూ మంత్రి పెద్దిరెడ్డి చెబుతున్నారు. కుప్పంలో చంద్రబాబు వరుస పర్యటనలు చేస్తున్నారు. ప్రతిసారీ పర్యటన సమయంలో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు వాటిని తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇదే సమయంలో కుప్పంనకు ముఖ్య నేతలంతా తరలి రావాలని చంద్రబాబు ఆదేశించారు. వచ్చే ఎన్నికలకు సిద్ధం అవుతున్న వేళ.. కుప్పం కేంద్రంగా కొత్త రాజకీయ అడుగులు ప్రారంభం కానున్నాయి.

ముఖ్య నేతలకు చంద్రబాబు ఆదేశాలు

పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై కూలంకషంగా చర్చించారు. జీవో నం.1 జారీ.. హైకోర్టు సస్పెన్షన్.. ఏపీ ప్రభుత్వం సుప్రీంలో అప్పీల్ అంశంపైన ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. ఈ నెల 27 నుంచి లోకేశ్ ప్రారంభించనున్న యువగళంపైన చర్చ జరిగింది.

పాదయాత్ర విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలు.. ప్రభుత్వం నుంచి ఏర్పడే అడ్డంకుల గురించి నేతలు విస్తృతంగా చర్చించారు. పార్టీ ముఖ్యులంతా కుప్పంనకు తరలి రావాలని చంద్రబాబు ఆదేశించారు. యాత్ర ప్రాధాన్యతను చంద్రబాబు వివరించారు. ముఖ్య నేతలతో పాటుగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల బాధ్యులు పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు కుప్పం రావాలని చంద్రబాబు నిర్దేశించారు.

యాత్రపై పార్టీకి దిశానిర్దేశం

టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. లోకేశ్ పాదయాత్ర నిర్వహణ.. పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై టెలీ కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో వర్తమాన రాజకీయాలు.. పార్టీ కమిటీల పని తీరు గురించి చంద్రబాబు పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేస్తారని సమాచారం.

లోకేశ్ పాదయాత్ర వ్యూహాత్మకంగా కీలకమైందని.. దీనిని విజయవంతం చేయటానికి పార్టీ యంత్రాంగం బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. జీవో నెంబర్ 1 పైన సుప్రీంకోర్టు ఇవ్వబోయే మార్గదర్శకాలపైన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి కనిపిస్తోంది. అటు లోకేశ్ పాదయాత్రను సక్సెస్ చేయటానికి చంద్రబాబు స్వయంగా పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు.

400 రోజులు.. 4000 కిలో మీటర్లు

నారా లోకేశ్ ఈ నెల 27న కుప్పం నుంచి యువగళం పేరుతో పాదయాత్ర ప్రారభించనున్నారు. ఈ యాత్ర మూడు రోజుల పాటు అదే నియోజవకర్గంలో కొనసాగనుంది. నిరంతరాయంగా యాత్ర కొనసాగేలా రూట్ మ్యాప్ ఖరారు చేశారు. తాజాగా తన పాదయాత్రపైన స్పందించిన లోకేశ్ తాను యాత్రలో ఉన్నా.. మనసంతా మంగళగిరిపైనే ఉంటుందన్నారు.

ఈ యాత్రలో ప్రధానంగా యువతను ఆకట్టుకొనేలా కార్యక్రమాలు.. అన్ని వర్గాల ప్రజలతో మమేకం అయ్యేలా ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ యాత్ర నారా లోకేశ్ రాజకీయ జీవితంలో కీలక మలుపునకు కారణం కానుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. దీంతో స్వయంగా చంద్రబాబు ఈ యాత్రపైన ఇప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు.

Also Read...

సీఎం జగన్‌ను కేసీఆర్ పక్కన పెట్టడానికి కారణం అదేనా..? 

Tags:    

Similar News